కాంగ్రెస్, బీజేపీలకు మద్దతు ఈయము, తీసుకోము: అరవింద్

 

రాజకీయ దిగ్గజాలయిన కాంగ్రెస్, బీజేపీలకు ఏడాది వయసు కూడా లేని ఆమాద్మీ పార్టీ డిల్లీలో చుక్కలు చూపించింది. ఆమాద్మీ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, బీజేపీ అధికారం చెప్పట్టేందుకు కేవలం నాలుగు సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఇప్పుడు ఆమాద్మీ మద్దతు ఇస్తే తప్ప డిల్లీ పీఠం ఎక్కాలనే బీజేపీ కల సాకారం కాదు. అందుకే ఆ పార్టీ తరపున ఎన్నికయిన అభ్యర్ధులతో అప్పుడే బీజేపీ బేరసారాలు మొదలుపెట్టింది. ఈవిషయాన్ని ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా దృవీకరించారు.

 

అయితే తమ పార్టీ తరపున గెలిచిన వారెవరూ కూడా బీజేపీ ప్రలోభాలకు లొంగేవారు కారని, వారు కూడా తనలాగే ఈ రాజకీయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలనే సంకల్పంతోనే రాజకీయాలలోకి వచ్చినందున, ఈ సంకీర్ణ బేరసార రాజకీయాలకు ఇష్టపడటం లేదని అన్నారు. తమ పార్టీ బీజేపీకి మద్దతు ఈయడం లేదా ఆ పార్టీ మద్దతు పుచ్చుకోవడం గానీ జరగదని అరవింద్ కేజ్రీవాల్ నిర్ద్వందంగా ప్రకటించారు. ఎందుకంటే భ్రష్టరాజకీయ సంస్కృతికి ఆలవాలమయిన కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేఖంగా పుట్టిన తమ పార్టీ, నిన్నటి వరకు వాటితో పోరాడి, మళ్ళీ ఇప్పుడు అవే పార్టీలతో జత కడితే, ఇక తమకు వాటికీ ఏమీ తేడా ఉండదని అన్నారు. కాంగ్రెస్ హయంలో లక్షల కోట్ల కుంభకోణాలు నిత్యం వెలుగు చూస్తున్నాయని, అటువంటప్పుడు స్వచ్చమయిన రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకొనేందుకు మరో 50 లేదా 100 కోట్లు ఖర్చుచేసి మళ్ళీ మరోమారు డిల్లీలో ఎన్నికలు నిర్వహించుకొంటే తప్పుకాదని అన్నారు.

 

అయితే సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిఈ ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన ఆమాద్మీ పార్టీ శాసనసభ్యులు దేశముదురు బీజేపీ చేసే రాజకీయాలకు, ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా ఉండగలరా? వారిని ఆమాద్మీ బీజేపీ నుండి కాపాడుకోగలదా? అరవింద్ కేజ్రీవాల్ కి ఉన్న దృడ సంకల్పం, దృడ నిశ్చయం వారూ కూడా కనబరచగలరా?

 

ఒకవేళ ఆమాద్మీ పార్టీ తన సిద్దాంతాలను కొంత సడలింపు చేసుకొని, బీజేపీతో జత కట్టి ప్రభుత్వంలో చేరి మరింత బలపడే ప్రయత్నం చేస్తుందా? లేకుంటే నిక్కచ్చిగా తన మాట మీద నిలబడి మళ్ళీ ఎన్నికలు ఎదుర్కొనేందుకే సిద్దపడుతుందా? కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆమాద్మీని మళ్ళీ ఎన్నికలకే పురిగొల్పుతుందా? వంటి ధర్మసందేహాలకు జవాబులు రానున్నరెండు మూడు రోజుల్లోనే తేలిపోవచ్చును.