కేజ్రీకి దెబ్బ మీద దెబ్బ..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కేంద్రప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు గురించి ప్రత్యకంగా చెప్పవలసిన పనిలేదు. కేజ్రీ రెండోసారి అధికారాన్ని అందుకున్న దగ్గర నుంచి ఇవాళ్టీ వరకు కేంద్రంతో పోరాటం చేస్తూనే ఉన్నారు. దీనంతటికి ప్రధాన కారణం గడచిన ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోవడమేనని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. గోవా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఆప్ దూసుకుపోతుండటంతో కేంద్రం మైండ్ గేమ్ మొదలెట్టిందని ఆరోపిస్తున్నారు. నయానో..భయానో కేజ్రీవాల్‌ను తన దారికి తెచ్చుకోవాలని బీజేపీ చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

ఇప్పటికే అనేక వ్యవహారాల్లో కేజ్రీ స్పీడ్‌కు బ్రేక్ వేసిన బీజేపీ సర్కార్ మరోసారి పెద్ద షాకిచ్చింది. సీఎం ముఖ్యకార్యదర్శి రాజేంద్రకుమార్ సహా ఐదుగురిని సీబీఐ నిన్న అవినీతి కేసులో అరెస్ట్ చేసింది. 2007-2015 మధ్య ఎండీవర్ సిస్టమ్స్ ప్రైవేట్‌ లిమిటెడ్ అనే సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ ప్రభుత్వ టెండర్లు ఐదింటిని దక్కించుకోవటానికి అనుకూలంగా వ్యవహరిస్తూ రాజేంద్రకుమార్ తన అధికారాలను దుర్వినియోగం చేశారని.. తద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల మేర నష్టం కలిగించారని సీబీఐ గతేడాది డిసెంబర్‌లో కేసు నమోదు చేసింది.

 

ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం కేజ్రీవాల్ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న రాజేంద్రకుమార్ సహా ఉప కార్యదర్శిగా పనిచేస్తున్న తరుణ్‌శర్మ, మరో ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులను విచారణ నిమిత్తం నిన్న ఉదయం సీబీఐ ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. మధ్యాహ్నం వరకు విచారించిన తర్వాత.. ఈ ఐదుగురిని అరెస్ట్ చేయాలని సీబీఐ నిర్ణయించింది. నిందితులైన అధికారులు ఆ కాంట్రాక్ట్‌లకు సంబంధించి రూ.3 కోట్లకు పైగా లబ్ధి పొందారనీ ఆరోపించింది. 1989 బ్యాచ్ అధికారి అయిన రాజేంద్ర, కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. ఆప్ సర్కార్ అధికారంలోకి వచ్చినపుడు మొదటగా జరిపిన అపాయింట్‌మెంట్ ఆయనదే. పాలనపై, పలు విషయాల్లో ఆయన కేజ్రీవాల్‌కు తలలో నాలుకగా వ్యవహరించేవారని ప్రభుత్వ వర్గాల భావన. అలాంటి వ్యక్తి అరెస్ట్ కావడంతో కేజ్రీవాల్ కేంద్రంపై ఫైరయ్యారు.

 

ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీపై తాను దర్యాప్తునకు ఆదేశించినందుకు ప్రతీకారంగానే కేంద్రం సూచనతో సీబీఐ అధికారులు రాజేంద్ర వెంటపడ్డారని కేజ్రీవాల్ ఆరోపించారు. తన కార్యాలయాన్ని కూడా వారు సోదా చేశారని విమర్శించారు. మరోవైపు ఢిల్లీ సర్కార్ అధికారాలపై ఆప్ సర్కార్ వేసిన పిటిషన్‌లోనూ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. ఢిల్లీకి రాష్ట్రంగా సంక్రమించిన అధికారాలు నిర్వచించాలని, రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించకుండా ఆపాలని సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై తక్షణమే స్పందించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆదేశాలు జారీచేయాల్సిందిగా ఢిల్లీ తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన విజ్ఞాపనలను న్యాయమూర్తులు జేఎస్ ఖేహర్, అరుణ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. రెండు అంశాలపై నేడే విచారణ జరుపాల్సిందిగా ఆమె చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. మరి ఈ రెండు అంశాలపై కేజ్రీవాల్‌ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోందో వేచి చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu