సజ్జలకు మహిళా కమిషన్ నోటీసులు
posted on Jun 12, 2025 9:34AM

అమరావతి ప్రాంత మహిళలపై అనుచితంగా, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టుకు మద్దతుగా మాట్లాడటమే కాకుండా.. ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టిన మహిళలను రాక్షసులు, పిశాచులు, సంకర జాతి అంటూ నోరు పారేసుకున్న సజ్జలకు ఆంధ్రప్రదేశ్ మహిళాకమిషన్ సమన్లు జారీ చేసింది. అమరావతి రాజధానిపై, అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వారిని ఉద్దేశించి సజ్జల చేజిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
సజ్జల వ్యాఖ్యలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాజాగా ఏపీ మహిళాకమిషన్ సజ్జలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది.
అంతకు ముందు మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయంలో మహిళాకమిషన్ చైర్ పర్సన్ కు అమరావతి మహిళలు సజ్జలపై ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలకు మహిళలు అంటే చులకన భావం ఏర్పడిందని, వైసీపీ హయాంలో తమను క్షోభకు గురి చేశారని, ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో కక్షపూరితంగా రాజధాని ప్రాంత మహిళలపై విషం కక్కుతున్నారని వారు పేర్కొన్నారు.