న్యాయవాదుల కేటాయింపులు.. ఏపీకి 492, తెలంగాణకు 335

 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటి వరకూ దాదాపు అన్ని శాఖల్లో విభజన జరిగింది. అయితే ఇప్పుడు న్యాయవ్యవస్థలో కూడా ఇరు రాష్ట్రాలు ముందడుగు వేసినట్టు తెలుస్తోంది. న్యాయధికారుల కేటాయింపునకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు ఓ జాబితాను తాజాగా విడుదల చేసింది. రెండు రాష్టాల్లో జిల్లా జడ్జీలు, సీనియర్ సివిల్ జడ్జీలు, జూనియర్ సివిల్ జడ్జీలు.. మొత్తం కలిపి 830 మంది ఉండగా వీరిలో ముగ్గురుతప్ప మిగతా 827 మంది ఆప్షన్లు ఇచ్చారు. దీని ఆధారంగా 827 మందిలో 492 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, 335 మందిని తెలంగాణకు కేటాయించారు.

 

తెలంగాణకు కేటాయింపులు...
తెలంగాణకు 335 మందిని కేటాయించగా.. అందులో 77 మంది జిల్లా జడ్జిల కేడర్, 65 మంది సీనియర్ సివిల్ జడ్జీల కేడర్, 193 మంది జూనియర్ సివిల్ జడ్జీల కేడర్ న్యాయాధికారులున్నారు. ఈ మూడు కేడర్లలోని 28 మంది విశ్రాంత న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించారు.

 

ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు...
ఆంధ్రప్రదేశ్‌కు 492 మందిని కేటాయించగా.. అందులో 79 మంది జిల్లా జడ్జీల కేడర్, 123 మంది సీనియర్ సివిల్ జడ్జీల కేడర్, 290 మంది జూనియర్ సివిల్ జడ్జీల కేడర్ న్యాయాధికారులున్నారు. 34 మంది విశ్రాంత న్యాయాధికారులను ఏపీకి కేటాయించారు. ముగ్గురు న్యాయాధికారులు ఆప్షన్లు ఇవ్వకపోవడంతో సర్వీసు రికార్డుల్లోని వివరాల ఆధారంగా వారిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.