ఏపీ ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రం కసరత్తు..

 

ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని నరేంద్రమోడీ ఏపీ ప్రత్యేక హోదాపై చర్చించేందుకు గాను ఈ నెల 25న భేటీకానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం అప్పుడే స్పష్టత ఇవ్వకపోవచ్చుననే ఊహాగానాలు రేగుతున్నాయి కానీ ప్రత్యేక  ప్యాకేజీపైన మాత్రం కేంద్రం దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం కేంద్రం కసరత్తు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగానే కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వడానికి  ‘ప్రాథమిక’ ప్యాకేజీని కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ ప్యాకేజీ కూడా ఇప్పటికే ప్రధాని కార్యలయానికి చేరినట్టు సమాచారం.

అయితే చంద్రబాబు.. మోడీ భేటీ అనంతరం వారు మాట్లాడుకున్నాక మార్పులు చేయడంకంటే ముందుగానే ఏపీకి ఏం కావాలో తెలుసుకుని సమగ్రంగా ప్యాకేజీని తయారు చేయాలని ప్రధాని మోదీ కేబినెట్‌ కార్యదర్శి పి.కె.సిన్హాకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో పి.కె.సిన్హా మోదీ ఆదేశాల ప్రకారం ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అనిల్‌ సింఘాల్‌ను ఫోన్‌ చేసి ప్రత్యేక ప్యాకేజీపై ఏపీ అవసరాలు, ఆకాంక్షలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో  ఏపీ ప్రభుత్వం తయారు చేసిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అనిల్‌ సింఘాల్‌ అందజేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu