జస్టిస్ కనగరాజ్ కు ఎట్టకేలకు పదవి.. ఏ పోస్టో తెలుసా? 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమించబడి.. హైకోర్టు ఆదేశాలతో తొలగించబడిన జస్టిస్ కనగరాజ్ కు ఎట్టకేలకు పదవి దక్కింది. ఏపీ పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ వి.కనగరాజ్‌ను ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులపై ఫిర్యాదులను విచారించే పోలీస్ కంప్లైంట్ అథారిటీకి చైర్మన్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది. పోలీసులు న్యాయం చేయకపోయినా, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించకపోయిన, సకాలంలో న్యాయం లభించక పోయినా ప్రజలు పీసీఏను ఆశ్రయించవచ్చు. 

పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.ఇందులో భాగంగానే  ఏపీ పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీని ఏర్పాటు చేసిన జగన్ సర్కార్.. ఛైర్మెన్ గా జస్టిస్ కనగరాజ్ ను అపాయింట్ చేసింది. పీసీఏలో రిటైర్డ్‌ ఐఏఎస్‌, రిటైర్డ్‌ ఐపీఎస్‌లతో పాటు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి సభ్యులుగా ఉంటారు. తమకు అందే ఫిర్యాదులపై పీసీఏ విచారణ చేసి బాధ్యులైన పోలీసులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. పీసీఏ  సిఫారసులను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలా వద్ద అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించి ఆయన స్థానంలో ఏపీ ఎస్‌ఈసీగా జస్టిస్ కనగరాజ్ గత ఏడాది ఏపీ ప్రభుత్వం నియమించింది. అయితే ఊహించని పరిణామాల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఆ పదవిని వదులు కోవాల్సి వచ్చింది. తర్వాత నిమ్మగడ పదవి కాలం ముగిసినా.. కనగ్ రాజ్ కు కాకుండా నీలం సాహ్నీని నియమించింది ఏపీ ప్రభుత్లం. దీంతో సీఎం జగన్ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జస్టిస్ కనగరాజ్ ను ఆయన బలి పశువు చేశారనే ఆరోపణలు వచ్చాయి. రూల్స్ ను బ్రేక్ చేస్తూ నిమ్మగడ్డను తొలగించి హడావుడిగా జస్టిస్ కనగరాజ్ ను నియమించిన జగన్ సర్కార్...  నిమ్మగడ్డ పదవి విరమణ తర్వాత ఎందుకు నియమించలేదని పలువురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ కనగరాజ్ కు సముచిత గౌరవం కల్పించాలని భావించిన సీఎం  జగన్.. ఆయన్ను పోలీస్ కంప్లైంట్ అథారిటీ బాధ్యతలు అప్పగించారు.