28 గంటల్లో 10 అంతస్తుల భవనం.. చైనీయుల మరో రికార్డ్ 

చైనీయులు మరో రికార్డు సాధించారు. 28 గంటల్లోనే 10 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ పరిజ్ఞానంతో శరవేగంగా నిర్మించిన భవనానికి భూకంపాలను తట్టుకునే దృఢత్వం ఉంది. 
వెయ్యేళ్ల జీవితకాలం దాని ప్రత్యేకతలు. అవసరమైతే ఆ భవనం అంతస్తులన్నీ విడగొట్టి.. వేరే చోటుకు తరలించే వెసులుబాటు కూడా ఉంది. సాధారణంగా నిర్మించే భవంతికి అయ్యే ఖర్చులో  
5 వంతులు తక్కువ బడ్జెట్‌లోనే ఈ అద్బుత భవనం కట్టారు చైనీయులు. 

కాలంతో పరుగెత్తుతున్నారా అన్నట్లుగా కార్మికులు కదిలారు. సిబ్బంది, కార్మికులు కలిసికట్టుగా కదులుతూ చకచకా పనులన్నీ చక్కబెట్టారు. నిర్మాణ పనుల్లో వెయ్యి మందికిపైగా వివిధ విభాగాల సిబ్బంది పాల్గొనగా, 3 భారీ క్రేన్లను వినియోగించారు. కేవలం 28 గంటల 45 నిమిషాల స్వల్ప వ్యవధిలోనే 10 అంతస్తుల భవంతిని నిర్మించేశారు. నిర్మాణరంగంలో కొత్త పోకడలకు చిరునామాగా నిలిచే చైనాకు చెందిన స్థిరాస్తి కంపెనీ ‘బ్రాడ్‌ గ్రూప్‌’ ఈ సరికొత్త రికార్డును లిఖించింది. ఈ నిర్మాణ పనుల వీడియోను బ్రాడ్‌ గ్రూప్‌ యూట్యూబ్‌లో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది

ఇంతవేగంగా భవనాన్ని నిర్మించేందుకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ నిర్మాణ పరిజ్ఞానాన్ని వినియోగించారు. భవనంలో ఉండాల్సిన గదులు, ఇతరత్రా వసతుల మాడ్యూల్‌లను ముందస్తుగా ఫ్యాక్టరీల్లో తయారు చేయించి ట్రక్కుల్లో సైట్‌కు తెప్పించుకొని.. నేరుగా ఎక్కడికక్కడ నట్లు, బోల్టులతో బిగించారు. దీంతో ఎంతో సమయం ఆదా అయిం ది. ఒక్కో మాడ్యూల్‌ను స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌తో.. 12 మీటర్ల పొడవు, 2.44 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తుతో రూపుదిద్దారు. భూకంపాలను తట్టుకొని నిలబడేంత దృఢంగా దీన్ని నిర్మించామని, ఈ భవంతి జీవితకాలం వెయ్యేళ్లని బ్రాడ్‌ గ్రూప్‌ తెలిపింది.

అవసరమైతే ఈ భవనాన్ని ఏ అంతస్తుకు ఆ అంతస్తుగా విడగొట్టి వాహనాల్లో తరలించి, మరో ప్రదేశంలో ఏర్పాటు చేసుకునే సౌలభ్యమూ ఉంటుందని ‘బ్రాడ్‌ గ్రూప్‌ తెలిపింది. ఇన్ని వెసులుబాట్ల దృష్ట్యా దీన్ని ‘లివింగ్‌ బిల్డింగ్‌’ గా పిలుస్తున్నట్లు కంపెనీ వివరించింది. ఇందులో విద్యుత్‌ వినియోగ ఆదా 20 శాతం మేర పెరుగుతుందని వెల్లడించింది.