జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా? ఢిల్లీలో అమిత్ షా కార్యాచరణ..

జమ్మూ కశ్మీర్  విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటించినట్లుగానే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించనున్నట్లుగా సమాచారం. ఈ దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో హోంశాఖ మంత్రి అమిత్ షా... జాతియ భద్రత సలహాదారు అజిత్ దోవల్, అజిత్ ధోవల్, హోంసెక్రటరీ, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, RAW చీఫ్, CRPF జనరల్, కశ్మీర్ DGPలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇందులో జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించడంపైనే చర్చించారని తెలుస్తోంది. త్వరలోనూ రాష్ట్ర హోదా కల్పిస్తూ కేంద్రం అధికారిక నిర్ణయం ప్రకటిస్తుందని ఢిల్లీ వర్గాల సమాచారం.. 

ఆగష్టు 5, 2019 న జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం జమ్మూ కాశ్మీర్, మరియు లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది. పూర్వపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించబడిన ఆర్టికల్ 370ని అదే రోజు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.అయితే జమ్మూ కశ్మీర్‌పై ఫిబ్రవరి 13, 2020న లోక్ సభలో హోం మంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామని స్పష్టం చేశారు. సరైన సమయంలో కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. బిల్లు తేవడమంటే రాష్ట్ర హోదా ఇవ్వబోమని కాదని తెలిపిన అమిత్ షా.. రాష్ట్ర హోదా ఇవ్వబోమని బిల్లులో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు దీనిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో అధికార పంపిణీ జరుగుతోందన్నారు అమిత్ షా. పంచాయతీలకు పరిపాలన, ఆర్థికపరమైన అధికారాలు కల్పించినట్టు వెల్లడించారు. కశ్మీర్‌పై ప్రతి అంశానికీ వివరణ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కశ్మీర్‌లో అధికార పంపిణీ, అధికార వికేంద్రీకరణ జరిగిందని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో 51 శాతానికి పైగా పోలింగ్‌ జరిగిందని గుర్తు చేశారు. ‘మా ప్రత్యర్థులు కూడా ఎత్తిచూపని విధంగా ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. లోక్ సభలో అమిత్ షా ప్రకటన తర్వాత నుంచే జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే కొవిడ్ కల్లోలంతో అది పక్కక పోయింది.

ప్రస్తుతం కొవిడ్ సెకండ్ వేవ్ కట్టడిలోకి రావడంతో కేంద్ర సర్కార్ జమ్మూ కశ్మీర్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గతంలో అమిత్ షా చెప్పినట్లుగానే ప్రత్యేక రాష్ట్ర హోదా కట్టబెట్టేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తుందని తెలుస్తోంది. గతంలోనే జమ్మూ కశ్మీర్, లఢక్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఏ పౌరుడైనా అక్కడ భూములు కొనుగోలు చేయడానికి మార్గం సుగమం చేసింది.  జమ్మూ కశ్మీర్ లో భారత దేశానికి చెందిన ఏ పౌరుడైనా అక్కడ భూములను కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ నివాసం ఉండే అవకాశాన్ని సైతం అందరికీ ప్రభుత్వం కల్పించింది. వ్యవసాయ భూములను ఇందులో నుంచి మినహాయించింది.  జమ్మూ కశ్మీర్ పునర్వ్యవ్యస్థీకరణ చట్టం ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి.