మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్.. తిరుమలలో సీఎం వెంటే ఉన్న మంత్రి

ఏపీలో కరోనా వ్యాప్తి విఐపిలను కలవరానికి గురి చేస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా సోకింది. కొద్ది రోజుల క్రితం తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాకు చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. తాజాగా ఈ వైరస్ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను కూడా తాకింది. రెండు రోజులుగా క‌రోనా ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా క‌నిపించడంతో ఆయ‌న ప‌రీక్ష‌లు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయ‌న ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.

 

ఇటీవ‌ల తిరుమ‌లలో జరిగిన బ్ర‌హ్మోత్స‌వాల సందర్భంగా మంత్రి వెల్లంపల్లి వారం రోజులు పాటు తిరుమ‌ల‌లోనే ఉన్నారు. అలాగే స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే దగ్గర నుండి కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి పాల్గొన్న కార్యక్రమంతో పాటు.. చివరకు హైదరాబాద్ కు బయలుదేరేవరకు అయన సీఎం జగన్ తోనే వున్నారు. దీంతో సీఎం ఆరోగ్యం ప‌ట్ల పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న మొద‌లైంది. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో సీఎం జగన్ ఆరోగ్యంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.