కేసీఆర్ చెప్పినా జగన్ వినలేదు.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ సీఎంగా అన్ని ప్రాంతాలనూ.. అందరినీ కలుపుకొని పోతూ అన్ని రాష్ట్రాలవారితో సఖ్యత కొనసాగిస్తుండటం విశేషం. ముఖ్యంగా అన్ని విషయాల్లోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్నేహపూర్వక వాతావరణం అనేది ప్రధానం. ఆ దిశగానే వైఎస్ జగన్ సర్కార్ అడుగులు వేస్తుంది. అందులో భాగంగా అవకాశం ఉన్నప్పుడంతా వైఎస్ జగన్ హైదరాబాద్ విచ్చేసి సీఎం కేసీఆర్ తో సమాలోచనలు జరిపి విభజన సమయంలో పరిష్కరించుకోవాల్సిన అంశాలపై చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు ఆ దిశగా చర్చోపచర్చలు జరిపారు. ముందుముందు కూడా అలాంటి వాతావరణమే ఇరు రాష్ట్రాల మధ్య నెలకొనే అవకాశం ఉంది.

ఇలాంటి సమయంలో ఏపీ మంత్రి పేర్నినాని తాజాగా ఆర్టీసీ విలీనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయ వద్దని తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పారని.. అయినా ఆయన మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదని అన్నారు. తాజాగా విజయవాడలో జరిగిన ఆర్టీసీ కార్మికులకు ఇంధన పొదుపు, భద్రత అవార్డులు అందించే కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

అసలేం జరిగిందంటే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారని మంత్రి చెప్పారు. ఇది చాలా పొరపాటని కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వానికి కార్మికుల వేతనాలు పెద్ద గుదిబండని కూడా కేసీఆర్ తెలిపినట్లు ఆయన వివరించారు. కానీ జగన్ మాత్రం ఈ విషయాన్ని సవాల్‌గా తీసుకొని విలీన ప్రక్రియను పూర్తి చేశారని పేర్ని నాని వివరించారు.

అంతేకాకుండా కార్మికుల విషయంలో ప్రభుత్వ విధానం తప్పని భావిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా పేర్ని నాని వెల్లడించారు. తమ ప్రభుత్వం చేస్తున్న పనుల్లో తప్పులున్నాయని నిరూపిస్తే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని.. ఆర్టీసీ కార్మికులు తమపై నమ్మకం ఉంచాలని.. ఇక సీపీఎస్‌ రద్దు, ఆర్టీసీ కార్మికులకు పింఛన్‌ డిమాండ్లను సీఎం జగన్ నెరవేర్చుతారని కూడా పేర్ని నాని వివరించారు.