ఏపీ లిక్కర్ స్కామ్‌లో నిందితులకు రిమాండ్ పొడిగింపు
posted on Aug 26, 2025 3:21PM

ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు వచ్చే నెల 9 వరకు రిమాండ్ పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో సిట్ అధికారులు నిందితులను న్యాయస్ధానంలో హాజరుపరిచారు. రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో 12 మంది నిందితులను జైళ్లకు అధికారులు తరలిస్తున్నారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ పి. మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు అధికారులు తరలించారు. మిగిలిన 9 మందిని విజయవాడ జైలుకు... అలాగే మరో ఇద్దరిని గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు.
మరోవైపు ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి మాట్లాడుతూ.. తనపై నమోదైన కేసును ఖండించారు. కస్టోడియల్ విచారణ అని సెట్ తనను అరెస్ట్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్‌లో తన పాత్ర ఎక్కడా లేదన్నారు. తన తప్పు ఎక్కడా లేకపోయినా.. ఆధారాలు సృష్టించారని రాజ్ కసిరెడ్డి ఆరోపించారు. గతంలో కానీ.. ప్రస్తుతం కానీ ఇప్పటి వరకు తనపై ఒక్క కేసు కూడా లేదన్నారు. లిక్కర్ కేసులో తప్పించి.. ఇప్పటి వరకు తాను అరెస్ట్ కాలేదని చెప్పారు.