జగన్ తో మాట్లాడండి.. షర్మిలకు వినతి
posted on Mar 9, 2021 1:19PM
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల దూకుడు కొనసాగిస్తున్నారు. వరుస సమావేశాలతో బిజిబిజీగా ఉంటున్నారు. షర్మిల పార్టీ తెలంగాణతో పాటు ఏపీలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆమె పార్టీపై ఏపీలోనూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన హోంగార్డులు లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిలను కలిశారు. తమ సమస్యలు చెప్పుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడాలని షర్మిలను కోరారు ఏపీ హోంగార్డులు.
తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్ర ప్రాంత హోంగార్డులు లోటస్ పాండ్‌లో వైఎస్ షర్మిలను కలిశారు. తమను తెలంగాణ నుంచి ఏపీలో విధుల్లోకి తీసుకునే విధంగా జగన్ ప్రభుత్వంతో మాట్లాడాలంటూ షర్మిలకు విన్నవించారు. తెలంగాణలో పని చేస్తున్నా ఇప్పటికీ తమను స్థానికేతరులుగానే గుర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా తమకు ఆప్షన్లు ఇవ్వలేదని, అందువల్ల ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని షర్మిల వద్ద హోంగార్డులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇక్కడ స్థానికేతరులుగా ఉండలేమని, తమను ఆంధ్రాలో విధుల్లోకి తీసుకునేలా సీఎం జగన్‌తో మాట్లాడాలని షర్మిలకు విజ్ఞప్తి చేశారు. హోంగార్డుల విన్నపంపై షర్మిల సానుకూలంగా స్పందించారు. హోంగార్డుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.