జగన్ ఇచ్చిన మాట తప్పినట్లేనా?.. ఏపీలో భారీగా పెరిగిన బస్ ఛార్జీలు

డిసెంబరు 11న అర్ధరాత్రి నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్టీసీ బస్ చార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు బస్సులో కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు కిలోమీటరుకు 20 పైసలు పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సులలోను కిలోమీటరుకు 10 పైసలు పెంచగా, వెన్నెల స్లీపర్ బస్సుల చార్జీలు మాత్రం అలాగే ఉంచారు. సిటీ బస్ లకు సంబంధించి పదకొండు స్టేజీల వరకూ చార్జీల పెంపు వర్తించదు అని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. పల్లె వెలుగు బస్సులలో మొదటి 2 స్టేజీలు లేదంటే 10 కిలోమీటర్ల వరకూ చార్జీల పెంపు ఉండదు. ఆ తర్వాత 75  కిలోమీటర్ల వరకు 5 రూపాయిలు పెంచారు. 4 ఏళ్ల క్రితం 49 రూపాయలున్న లీటర్ డీజిల్ ధర ఇప్పుడు 70 దాటింది. ఫలితంగా సంస్థకు ఏటా రూ.630 కోట్లు నష్టం వస్తోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. బస్సులే విడి భాగాలు, సిబ్బంది జీతాలు ఇతర అలవెన్సుల కారణంగా మరో రూ.650 కోట్ల రూపాయల మేర ఆర్టీసి పై భారం పడుతుంది. మొత్తంగా ఏపీలో ఆర్టీసీకి ఏటా రూ.1200 కోట్ల రూపాయల వరకు నష్టం వస్తుంది. వీటి నుంచి గట్టెక్కడానికి చార్జీలు పెంచక తప్పలేదన్నారు రవాణశాఖామంత్రి పేర్ని నాని. 

మొత్తం 12 జిల్లాలలో ఆర్టీసీకి రూ.6,735 కోట్ల రూపాయల అప్పులున్నాయని 100 ల కోట్ల విలువైన స్థలాలున్నాయి బ్యాంకులు వివిధ సంస్థల నుంచి తెచ్చిన అప్పులు రూ.2,995 కోట్ల రూపాయల వరకు ఉండగా ఇతర బకాయిలు రూ.3,700 ల కోట్ల రూపాలున్నాయి. చార్జీల పెంపుతో జిల్లాలో నెలకు 8 కోట్ల దాకా ప్రయాణీకుల పై భారం పడనుంది. ఒక్కో జిల్లాకు ఏడాదికి రూ.100 కోట్ల రూపాయల అప్పులు కేటాయించాలనీ ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది. సూపర్ లగ్జరీలో ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్ కు రూ.317 రూపాయలు ఉండగా అది రూ.371 రూపాయలకు పెరిగింది. అలాగే విజయవాడ నుంచి తిరుపతికి రూ.474 రూపాయలు ఉండగా రూ.550 రూపాయల వరకు పెరిగింది. ఇక విజయవాడ నుంచి విశాఖకు ప్రస్తుతం రూ.430 రూపాయల ఉన్న ధర రూ.503 రూపాయలకు చేరింది. విజయవాడ నుంచి నెల్లూరుకు ప్రస్తుతం రూ.317 రూపాయల చార్జీ ఇవాళ్టి నుంచి రూ.373 రూపాయలైంది. మరోవైపు ఆర్టీసీ చార్జీల పెంపు పై టిడిపి అప్పుడే నిరసనలకు పిలుపు నిచ్చింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ఆందోళన చేయబోతుంది. సచివాలయం దగ్గర టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు పలువురు నేతలు ఆందోళనలో పాల్గొంటారు.