బ్యాంకుల్లో డిపాజిట్ చేయవద్దని శాఖలకు ఆర్డర్.. నిధుల కోసం జగనన్న మరో స్కెచ్

ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏం చేస్తోందో తెలుస్తోందా..? ఖజానాలో నిధులన్నీ నిండుకోవడంతో ఏ ప్రభుత్వ విభాగాన్నీ విడిచిపెట్టకుండా వడికేస్తోంది. చేతికి దొరికిన చోటల్లా అప్పుల మీద అప్పులు చేస్తోంది. ఆపై ఓవర్ డ్రాఫ్ట్ కోసం దేబిరిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరో ఎత్తు వేసింది జగన్ రెడ్డి సర్కార్..

అందేంటంటే.. ఏపీలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు తమ వద్ద ఉన్న ప్రజాధనాన్ని ఏ బ్యాంకుల్లోనూ డిపాజిట్ చేయకూడదని హుకుం జారీ చేసింది. కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్లో మాత్రమే ఆయా శాఖలు డిపాజిట్లు చేయాలని స్పష్టంగా ఆదేశించింది. పైగా ప్రజా ధనాన్ని రక్షణ కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన ఈ తాజా ఉత్తర్వులతో ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు తమ వద్ద ఉన్న ధనాన్ని ఇక నుంచి ఏ బ్యాంకులోనూ డిపాజిట్ చేసే వీలు ఉండదు. ప్రభుత్వ కార్పొరేషన్లు, సొసైటీలు, బోర్డులు, ట్రస్టులు, సంస్థలు, యూనివర్శిటీలు, ప్రత్యేక ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిన ఇతర సంస్థలన్నీ తమ వద్ద ఉన్న మిగులు నిధులను ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్లో మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే.. టీటీడీ, రాష్ట్రంలోని ఇతర దేవాలయ సంస్థలను ఈ తాజా ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఇచ్చింది జగన్రెడ్డి సర్కార్.

బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీగా ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్ను భారతీయ రిజర్వు బ్యాంక్ వద్ద ప్రభుత్వం నమోదు చేసింది. ఈ కార్పొరేషన్లో ప్రభుత్వ సంస్థలు కూడా తమ నిధులను డిపాజిట్ చేయొచ్చని 2020 మార్చి నెలలో ఉత్తర్వులు ఇచ్చింది. ఇతర వాణిజ్య బ్యాంకుల్లో అయినా ప్రభుత్వ సంస్థలు తమ వద్ద ఉన్న నిధులను డిపాజిట్ చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. ఏపీ సర్కార్ ఇచ్చిన తాజా ఉత్తర్వులతో ఇప్పుడు ఆ సదుపాయం నుంచి ప్రభుత్వ సంస్థలను జగన్రెడ్డి సర్కార్ దూరం చేసినట్లయింది. ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో అయితేనే ప్రజా ధనానికి రక్షణ ఉంటుందని వైసీసీ సర్కార్ తన ఆర్డర్లో ఓ ముక్తాయింపు కూడా ఇచ్చింది.

ప్రభుత్వ కార్పొరేషన్లలోని నిధులను ఈ మధ్య కాలంలో అక్రమంగా మళ్లించిన అంశాన్ని కూడా ఏపీ సర్కార్ జీవోలో ప్రస్తావించడం గమనార్హం. ఆంధ్రప్రదేవ్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్లోని రూ.9.60 కోట్లలో కొంత మొత్తం ప్రైవేట్ అకౌంట్కు మళ్లించిన విషయం పేర్కొంది. ఏపీ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ నుంచి రూ.5 కోట్లను సంస్థకు తెలియకుండా మళ్లించిన వైనం ప్రస్తావించింది ఏపీ ప్రభుత్వం.

ఈ మాదిరి అవకతవకలకు ఆస్కారం లేకుండా నిరోధించేందుకే తాజా ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వుల్లో వివరించారు. నిధులను ఏపీ ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్కు మళ్లించాలని జగన్రెడ్డి సర్కార్ ఇటీవల వత్తిడి చేసినా పలు సంస్థలు పెడచెవిన పెట్టడంతోనే తాజా ఆదేశాలు జారీ చేసినట్లు పలు వర్గాల్లో చర్చ జరుగుతోంది.