బిగ్ బాస్ షోపై రాజకీయ రచ్చ.. రవి ఎలిమినేషన్ పై బీజేపీ ఎమ్మెల్యే గుస్సా..

టీవీ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ బిగ్ బాస్ షోపై రాజకీయ రచ్చ రాజుకుంది. తెలుగు బిగ్ బాస్ షోలో యాంకర్ రవి ఎలిమినేషన్ తీవ్ర వివాదాస్పదమవుతోంది. తెలుగు ఐదవ సీజన్ లో భాగంగా ఆదివారం జరిగిన 12వ ఎపిసోడ్ లో ఎవరూ ఊహించని రీతిలో యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యారు. టాప్ కంటెస్ట్ గా ఉన్న రవి ఎలిమినేషన్ అందరికి షాకిచ్చింది. అదే సమయంలో వివాదానికి కారణమైంది. యాంకర్ రవి అభిమానులు ఏకంగా  అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద నిరసన తెలపడం ఉద్రిక్తతకు దారి తీసింది. 

మొదటి నుండి టాప్ 5 కంటెస్టెంట్ అని అందరూ భావించిన రవి, మూడు వారాల ముందుగా ఎలిమినేట్ అయ్యారు.  ప్రియాంక , సిరి , కాజల్ ల కంటే రవికి ఉన్న ఓటింగ్ చాలా ఎక్కువ అని అనధికార ఓటమి వెబ్సైట్స్ చెబుతున్నాయి. ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ కూడా వీరు ముగ్గురు తో పోలిస్తే రవికి ఎక్కువే. ‌ అయినా రవి ఎలిమినేట్ అయ్యారు. దీంతో  బిగ్ బాస్ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగానే రవిని ఎలిమినేట్ చేశారన్న అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. రవి అభిమానులు ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణకు చెందిన వ్యక్తి అనే రవిని కావాలనే తప్పించారని మండిపడుతున్నారు. 

బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారమే నిర్వాహకులు రవిని తప్పించారని, టాప్ 5 లో కనీసం ఇద్దరు అమ్మాయిలు ఉండేలా ప్లాన్ చేశారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  శ్రీరామ్ చంద్రకి మేలు చేయడం కోసం నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా రవిని ఎలిమినేట్ చేశారని మరికొందరు చెబుతున్నారు. రవికి మిగతా వారితో పోలిస్తే చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని, ఇప్పటికే దాదాపు కోటి రూపాయల దాకా పారితోషికం రవికి అందిందని, అదే ఆయన ఎలిమినేషన్ కు కారమణని మరికొందరు అంటున్నారు. బిగ్ బాస్ ఎలిమినేషన్ లో ఆడియెన్స్ ఓటింగ్ తోపాటు బడ్జెటింగ్ కూడా కీలకంగా ఉంటుందని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. గత సీజన్ లో  కుమార్ సాయి ని కూడా ఇదే విధంగా ఎలిమినేట్ చేశారన్న విమర్శలు వచ్చాయి. 

యాంకర్ రవి కి మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిలిచారు‌. ఉద్దేశపూర్వకంగానే నిర్వాహకులు యాంకర్ రవిని ఎలిమినేట్ చేశారని ఆయన ఆరోపించారు. అసలు బిగ్ బాస్ షో ని బ్యాన్ చేయాలని కేంద్రానికి లేఖ రాస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే రాజాసింగ్.  తన ఎలిమేషన్ పై వస్తున్న వివాదంపై యాంకర్ రవి కూడా స్పందించారు. బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోలేక పోయినప్పటికీ ప్రేక్షకుల స్పందన చూస్తూ ఉంటే తాను గెలిచినట్లు భావిస్తున్నానని అంటూ రవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.