జగన్,బాబు వార్.. వివేకా కేసులో ట్విస్ట్.. సభలో రచ్చ.. బౌలర్లు ఫెయిల్.. టాప్ న్యూస్@7PM

వరదలతో చనిపోయిన వారివి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమని సీఎం జగన్ రెడ్డి వ్యాఖ్యానించడం చేతగానితనమేనని విమర్శించారు. ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌లో ఘోరంగా విఫలమయ్యారని, దీనిపై న్యాయ విచారణ జరగాలన్నారు. 
------
టీడీపీ అధినేత చంద్రబాబువి బురద రాజకీయాలు చేస్తున్నారని సీఎం జగన్ దుయ్యబట్టారు. వరద బాధితులను ఆదుకునేందుకు శరవేగంగా చర్యలు చేపట్టామని తెలిపారు. గతంలో బాధితులను ఆదుకునేందుకు కనీసం నెల పట్టేదన్నారు. ఇప్పుడు వారం రోజుల్లోనే బాధితులకు ఆదుకోగలిగామని చెప్పారు. నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్ పూర్తిచేసి.. సీజన్‌లోగా వారికి సహాయం అందిస్తున్నామని జగన్ తెలిపారు.
-----
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ను కలిశాడు గంగాధర్ రెడ్డి. సీబీఐ, వివేకా అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీ ని కోరాడు గంగాధర్ రెడ్డి. ఈ కేసులో తాము చెప్పినట్లే వాంగూల్మం ఇస్తే 10 కోట్ల రూపాయలు ఇస్తామని సీబీఐ ఆఫర్ చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు గంగాధర్ రెడ్డి. 
-----
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎగువ అహోబిలం రహదారిలో అదుపుతప్పి ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు ఎగువ అహోబిలం నుంచి దిగువ అహోబిలంకు వస్తుండగా  ఈ  ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
-------
శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి మృతి పట్ల సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం తెలిపారు. శేషాద్రి మృతి శ్రీవారి ఆలయానికి, భక్తకోటికి తీరని లోటని పేర్కొన్నారు. ఆలయ వ్యవహారాలపై శేషాద్రి చెరగని ముద్ర వేశారని సీజేఐ కొనియాడారు. శ్రీవారి సేవలపై శేషాద్రికి ఉన్న అవగాహన అనన్యసామాన్యమన్నారు. ఆలయ ఆచారాలపై శేషాద్రికి ఎంతో అవగాహన పరిజ్ఞానం ఉందని తెలిపారు. డాలర్‌ శేషాద్రి కుటుంబసభ్యులకు ఎన్వీ రమణ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
----
సాగు చట్టాల రద్దు బిల్లు- 2021కి లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళనల మధ్యే బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. బిల్లుపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వారి డిమాండ్ను తిరస్కరించిన స్పీకర్ ఓం బిర్లా.. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపారు.
--
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్న తెరాస ఎంపీలు  పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజే రభస సృష్టించారు. తెరాస పార్లమెంట్ సభ్యులు సభలో అదే విషయంపై చర్చకు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని తెరాస ఎంపీలు డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డుల్లో మ‌క్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని తెరాస ఎంపీలు డిమాండ్ చేశారు. 
-------
గత ఒప్పందాల ప్రకారమే రాష్ట్రం నుంచి కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని  కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రైతులకు వరి విత్తనాలు అందించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ఆయన ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటన్నారు.
-------
సంగారెడ్డి జిల్లా  పఠాన్ చెరు మండలం, ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ గురుకుల పాఠశాలలో మొత్తం 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలను అధికారులు వైద జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌కు పంపారు. 
---
భారత్, న్యూజీలాండ్ తొలి టెస్టు నాటకీయ పరిణామాల మధ్య డ్రాగా ముగిసింది. చివరి ఎనిమిది ఓవర్లలో విజయానికి వికెట్ తీయాల్సి ఉండగా.. భారత బౌలర్లు విఫలమయ్యారు. తీవ్ర ఉత్కంఠగా సాగిన చివరి 8 ఓవర్లను కివీస్ బ్యాట్స్ మెన్ అజాజ్ పటేల్, రవీంద్ర అద్భుతంగా ఎదుర్కొన్నారు. భారత బౌలర్లు ఎంతగా శ్రమించినా వికెట్ పడకపోవడంతో కాన్పూర్ టెస్టుగా డ్రాగా ముగిసింది.