ఏపీలో క‌రెంట్ బిల్లు షాక్ కొడుతోంది! బిల్లు చూసి గుడ్లు తేలేస్తున్న జ‌నం!

లిక్కర్‌ దెబ్బతో రాష్ట్ర ఖజనాని నింపుకుంటూ, మందు బాబుల పొట్ట కొడుతున్న ప్రభుత్వం ఇప్పుడు కరెంటు బిల్లులపై దృష్టి పెట్టింది. కరోనా వైరస్‌ కారణంగా ఓ నెల రీడింగులు తీయకపోవడంతో, శ్లాబ్‌లు మారిపోయాయి. అదొక్కటే కారణం కాదు.. ఇతరత్రా కారణాలు కూడా కలిసి బిల్లులు వాచిపోతున్నాయి.. దాంతో, సామాన్యుడి నడ్డి విరిగిపోతోంది.

విద్యుత్ శాఖ ఉద్యోగులు 30రోజులకు బిల్ తీయాలి. క‌రోనా కార‌ణంగా బాగా ఆల‌స్యం జ‌రిగింది. దీంతో శ్లాబ్‌ల లెక్క మారిపోయింది. 100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి 3.60 రూపాయలు. (ఒక్కొక్క యూనిట్ కాస్ట్.). 2 రోజులు delay చేయడం వల్ల 2 రోజులలో 6 యూనిట్స్ తో కలిపి 106 యూనిట్స్ వొచ్చింది. అంటే అప్పుడు 101 యూనిట్స్ దాటితే పర్ యూనిట్ ధర 6.90 రూపాయలు. ఇక్క‌డే వుంది టెక్నిక్‌.

ప్ర‌జ‌లు అన‌వ‌స‌రంగా అంటే మూడు రూపాయ‌ల 60 పైస‌ల స్లాబ్ నుంచి ఆరు రూపాయ‌ల తొంభై పైస‌ల స్లాబ్‌లో బ‌ల‌వంతంగా చేరాల్సి వ‌స్తోంది.

లెక్క ఇలా వుంటోంది. కేవ‌లం రెండు రోజులు ఆల‌స్యంగా బిల్ రీడింగ్ చేయ‌డం వ‌ల్ల 6.90 రూపాయల లెక్క ప్రకారం కట్టాలి. అప్పుడు 101 × 6.90 = 690 కట్టవలసి వస్తుంది. 100 యూనిట్స్ కు 390/-, తేడా 690-390=300 అదనం. ఇదే ప్ర‌స్తుతం జ‌రుగుతోంది.

రెండు నెలలకు ఒకసారి బిల్లు ఇవ్వడంతో స్లాబులు మారిపోతున్నాయి అని, 4, 5 రేట్లు పెంచి దొంగ లెక్కలతో ప్రభుత్వం ప్రజల్ని దోచుకోవటం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. మధ్య తరగతి వర్గాలు కరెంట్ బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుందని అన్నారు. లాక్ డౌన్ సమయంలోని కరెంటు బిల్లును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేయ‌డానికి టిడిపి సిద్ధ‌మ‌వుతోంది.

అయితే శ్లాబ్‌లు మారిపోయిందంటూ వ‌స్తున్న వార్త‌ల్లో వాస్తవం లేదంటున్నారు అధికారులు. బిల్లింగ్ అనేది ప్రత్యేక సాఫ్ట్‌వేర్ గొడుగు కింద పనిచేస్తుందని.. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెబుతున్నారు. ఎవరో మేధావులు సోషల్ మీడియాలో చేస్తున్నది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. కరెంట్ బిల్లుల విషయంలో తప్పులు జరగబోవని స్పష్టం చేస్తున్నారు. బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ చాలా కాలం కిందటే సవరించామని, అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. వినియోగదారుడు 1 బి (1) స్లాబ్ పరిధిలోకి వస్తే, మొదటి స్లాబ్ రేటు 0-100 యూనిట్లకు 3 రూపాయల 30 పైసలు చొప్పున ఉంటే 330 రూపాయల బిల్లు వస్తుంది. అదే బిల్లింగ్ 10 రోజులు ఆలస్యం జరిగినప్పటికీ వినియోగదారుడికి మాత్రం అన్యాయం జరగదని అంటున్నారు అధికారులు. ఒకవేళ 40 రోజుల్లో సదరు వినియోగదారుడు 133 యూనిట్లు కాలిస్తే.. బిల్లింగ్ తేదీని ప్రామాణికంగా తీసుకుని ఆటోమేటిక్‌గా ఆ 133 యూనిట్లు కూడా మొదటి స్లాబ్ పరిధిలోకి వస్తాయే తప్ప రెండో స్లాబ్ లోకి రావని వివరిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో క‌రెంట్ బిల్లుల‌కు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30వరకు విద్యుత్ బిల్లుల చెల్లింపులు వాయిదా వేయాలని పంపిణీ సంస్థలకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.