సోమవారం-బీరువారం!.. లిక్కర్ సేల్స్ కోసం కలెక్టర్లు, ఎస్పీలు!
posted on Dec 8, 2021 11:41AM
ఢిల్లీలో సివిల్ సర్వెంట్ల ఎంపిక కోసం యూపీఎస్‌సీ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఏపీ నుంచి ఓ అభ్యర్థి ఇంటర్వ్యూకు హాజరయ్యారు. సెలెక్ట్ అయితే.. మొదట ఐఏఎస్.. ఆ తర్వాత కలెక్టర్ అవుతాడు. ఇంటర్వ్యూ ప్యానెల్ వ్యక్తి ఓ ప్రశ్న అడిగాడు. కలెక్టర్ అయితే ఏం చేస్తావని ప్రశ్నించాడు. మనోడు ఏపీ నుంచి వచ్చాడుగా.. అందుకే లిక్కర్ సేల్స్‌మెన్‌గా మారి మద్యం అమ్మకాలు పెంచుతానని ఆన్సర్ ఇచ్చాడు. ఆ సమాధానం విని.. ఇంటర్వ్యూ ప్యానెల్ అవాక్కైంది. అదేంటి, కలెక్టర్ ఏంటి..? లిక్కర్ సేల్స్‌మెన్ కావడమేంటని.. మొదట ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత విషయం తెలుసుకొని ముక్కున వేలేసుకుంది. ఆ అభ్యర్థి చెప్పింది కరెక్ట్ ఆన్సరే.. ఎందుకంటే ఏపీలో జిల్లా కలెక్టర్లు చేస్తున్నది.. చేయాల్సింది..అదే. ఇది పిట్టకథనే అయినా.. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న వాస్తవం. లిక్కర్ సేల్స్ పెంచడమే. ప్రతీ సోమవారం ఆ వివరాలు చీఫ్ సెక్రటరీకి చెప్పాల్సిందే.
ఏపీ బతుకు బండి ఎలా నడుస్తోందో తెలుసుగా. మద్యం అమ్ముడైతేనే.. పాలన ముందుకు సాగేది. లిక్కర్ మినహా దమ్మిడీ ఆదాయం లేదాయే. మద్యం షాపులే జగన్‌రెడ్డి సర్కారుకు మెయిన్ ఇన్‌కమ్ సోర్స్. అందుకే, మునుపెన్నడూ లేనట్టు ప్రభుత్వమే సొంతంగా లిక్కర్ షాపులు తెరిచింది. భారీగా రేట్లు పెంచేసింది. ఊరూ పేరు లేని బ్రాండ్లు అమ్ముతోంది. అవి తాగలేక.. వేరే సరుకు దొరకక.. పాపం మందుబాబులు పడుతున్న కష్టం.. మింగుతున్న ఆ చేదు గరళం గురించి ఆ పరమాత్మకే తెలుసు.
ఇంత వరకూ ఓకే. తాజాగా మరింత చోద్యం. గత టీడీపీ ప్రభుత్వం.. సోమవారాన్ని పోలవారంగా చేయగా.. ఇప్పటి వైసీపీ సర్కారు సోమవారాన్ని బీరువారంగా మార్చేసిందంటున్నారు. నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్టు.. సీఎం జగన్‌రెడ్డి ఆదేశాలతో స్వయంగా చీఫ్ సెక్రటరీనే ప్రతీ సోమవారం మద్యం అమ్మకాలపై కలెక్టర్లతో రివ్యూలు చేస్తున్నారట. కలెక్టర్లను లిక్కర్ సేల్స్‌మెన్‌గా మార్చేస్తున్నారంటున్నారు. సీఎస్ ఏంటి.. వారం వారం మద్యం అమ్మకాలపై సమీక్ష ఏంటని అనుకోనవసరం లేదు. జగన్ సర్కారుకు ఇంతకంటే పెద్ద పనే ముంది మరి? వైన్ షాపులు ఎంత బాగా నడిస్తే.. ప్రభుత్వ జట్కాబండి అంతా సాఫీగా ముందుకు సాగుతుంది. అందుకే, వానలు, వరదల బీభత్సం, రోడ్ల దుస్థితి కంటే కూడా.. లిక్కర్ సేల్సే ముఖ్యమైంది మన సీఎస్‌కి అంటూ అధికారులే విమర్శిస్తున్నారు.
మద్యం అమ్మకాలపై ప్రతీ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఠంచనుగా సీఎస్ సమీక్షిస్తున్నారని సమాచారం. లిక్కర్ సేల్స్‌పై, పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా అడ్డుకోవాల్సిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) పనితీరుపై.. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎస్ క్లాస్ తీసుకుంటున్నారట. ఈ వారం ఎన్ని కేసుల బీర్లు అమ్మారు? ఎంత మద్యం అమ్ముడుపోయింది? ఆ ప్రాంతంలో సేల్స్ ఎందుకు తగ్గాయి? గతవారంతో పోలిస్తే ఆదాయం ఎందుకు తగ్గింది? మీరంతా ఏం చేస్తున్నారు? అమ్మకాలు పెంచాల్సిందే? అంటూ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ.. కలెక్టర్లు, ఎస్పీలతో ప్రతీ సోమవారం రివ్యూ చేస్తుండటంపై ఐఏఎస్‌ల సంఘం ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది.
జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిన కలెక్టర్లుకు ఇలా వారం వారం మద్యం అమ్మకాలపై సీఎస్ క్లాస్ ఇస్తుండటం.. బీర్లు, బాటిళ్ల లెక్కలు చెప్పాల్సి రావడం.. సిగ్గుగా భావిస్తున్నారు జిల్లా కలెక్టర్లు. ఆ రివ్యూ మీటింగ్‌లో జరుగుతున్న కొన్ని ఆసక్తికర సంభాషణలు కూడా బయటకి వచ్చాయి. ‘మీ జిల్లాలో ఫలానా ప్రాంతంలో సేల్స్ తగ్గాయి ఎందుకు’ అని ఓ కలెక్టర్‌ను సీఎస్ అడగ్గా... ‘‘సార్, బడ్‌వైజర్ బీర్‌కు బాగా డిమాండ్ ఉంది. అవి పంపితే సేల్స్ పెరుగుతాయి’ అని ఆయన సెలవిచ్చారట. అలా కుదరదు.. ఉన్న బ్రాండ్లతోనే అమ్మకాలు పెంచాలంటూ సీఎస్ తేల్చి చెప్పారని తెలుస్తోంది.
ఇక జిల్లా ఎస్పీలకు తప్పట్లేదు సీఎస్ నుంచి షంటింగ్స్ అంటున్నారు. పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా వస్తున్న మద్యం అమ్మకాలను అడ్డుకోవడంలో మరింత కఠినంగా ఉండాలని.. నాటుసారా బట్టీలు లేకుండా చేయాలని.. ఎప్పటికప్పుడు సీఎస్ నుంచి సూచనలు వస్తున్నాయట. ఎక్సైజ్ శాఖ నుంచి 70 శాతం మంది సిబ్బందిని తీసుకుని, ప్రతి మూడు పోలీసు స్టేషన్ల పరిధిలో ఒక సెబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని, సెబ్ ద్వారా సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టి మరీ అక్రమ మద్యాన్ని కట్టడి చేస్తున్నారు. ఇంకా ఏం చేయాలి? శాంతి భద్రతలు వదిలేసి.. మద్యం రవాణాపైనే దృష్టి పెట్టాలా? అంటూ ఎస్పీలు ఆఫ్ ది రికార్డ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ప్రతీ సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మద్యం అమ్మకాలపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహిస్తుండటం.. చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారికి చీప్‌గా లేదా అంటూ ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కలెక్టర్లు, ఎస్పీల బాధ్యతలకు కొత్త నిర్వచనం చెబుతున్నారని.. ఇదెక్కడి పాలన అని మండిపడుతున్నారు. అవసరమైతే ఈ విషయంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయాలనే దిశగానూ సివిల్ సర్వెంట్లు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. జగనన్న ప్రభుత్వమా.. మజాకా..!
గంటకు 10 కోట్ల తాగుడు.. ఆ నాలుగు జిల్లాలే టాప్.. సర్కారు కొత్త టార్గెట్..