రాష్ట్ర కాంగ్రెస్ లో పెరుగుతున్న ‘టి’ గ్యాప్’

 

 

 

అంతా అనుకున్నట్లు జరిగితే, మరో 20 రోజుల్లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఫై కేంద్రం ఓ ప్రకటన చేయాల్సి ఉంది. ఈ ప్రకటన తమకు అనుకూలంగా వచ్చేలా చూసేందుకు తెలంగాణా, సీమంధ్రా ప్రాంత నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు. కేంద్రంఫై వత్తిడి తెచ్చేందుకు వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

 

ఇరు ప్రాంతాల నేతలు తమకు అనుకూల ప్రకటనలు చేయడంలో మునిగిపోయారు. తాజాగా తెలంగాణా రాష్ట్రం ఇస్తే, తాను తన పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు కృష్ణా రెడ్డి ప్రకటించారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం సీమంధ్రా ప్రాంత పారిశ్రామిక వేత్తలు ఉద్యమాన్ని చులకన చేస్తున్నారని,అసలు ఉద్యమాన్నే కించపరుస్తున్నారని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు పి.ప్రభాకర్ సీమంధ్రా ప్రాంత రాజకీయ నేతలఫై విరుచుకుపడ్డారు.

 

తనకు కేంద్ర మంత్రి పదవి దక్కలేదనే కోపంతో ఉన్న ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివ రావు ఆ కోపాన్ని తెలంగాణా నేతలఫై చూపిస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యమం పేరిట భారీ ఎత్తున డబ్బులు దండుకుంటున్నారని కావూరి ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అసలు తెలంగాణా ప్రజలు రాష్ట్ర విభజన కోరుకోవడం లేదని బాపట్ల శాసన సభ్యుడు గాదె వెంకట రెడ్డి అన్నారు.

 

ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం అంటూ ఏర్పడితే, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజ్ గోపాల్ ప్రతిజ్ఞ చేశారు. ఇలా ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వారు ప్రకటనలు చేస్తూ పోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మధ్య అంతరం రోజు రోజుకు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.