హస్తినకు ఏపీ సీఐడీ అధికారులు.. నారా లోకేష్ అరెస్టు కోసమేనా?

స్కిల్  కేసులో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని అరెస్టు చేసిన ఏపీ సీఐడీ ఇప్పుడు నారా లోకేష్ అరెస్టుకు రంగం సిద్ధం చేసిందా? హస్తిన పర్యటనలో ఉన్న ఆయనను అక్కడే అరెస్టు చేసి ఏపీకి తీసుకురావాలని భావిస్తున్నారా అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననే  సమాధానం చెప్పాల్సి వస్తున్నది. ఎందుకంటే ఏపీ సీఐడీ  చీఫ్ సంజయ్, ఎస్పీ సరిత, ఇద్దరు సీఐలు, నలుగురు కానిస్టేబుళ్లు హస్తిన బయలుదేరనున్నారు. వారి హస్తిన యానం లక్ష్యం నారా లోకేష్ అరెస్టేనని పరిశీలకలు సైతం విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తరువాత వరుసగా సీఐడీ చీఫ్ సంజయ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారా లోకేష్ ను కూడా అరెస్టు చేస్తామని బహిరంగంగా చెప్పిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఇటీవలి కాలంలో అంటే చంద్రబాబు అరెస్టు తరువాత పలువురు మంత్రులు, వైసీపీ నేతలూ కూడా తరువాతి అరెస్టు లోకేషే అంటూ ప్రకటనలు గుప్పించిన సంగతీ విదితమే. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ బృందం హస్తినకు బయలుదేరడంతో లోకేష్ అరెస్టు అవుతారన్న వార్తలు జోరుగా వినవస్తున్నాయి. ఇప్పటికే స్కిల్ కేసులో మరిన్ని అరెస్టులు జరగనున్నాయని ఏపీ సీఐడీ సంజయ్ వెల్లడించిన నేపథ్యంలో ఏపీ సీఐడీ బృందం హస్తిన పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  సీఐడీ బృందం హస్తిన యానం లక్ష్యం నారా లోకేష్ అరెస్టేనని తెలుగుదేశం నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటనలో వారు సుప్రీం కోర్టు న్యాయవాదులతో భేటీ అవుతారని కూడా సమాచారం.  అంతే కాకుండా హస్తినలో లోకేష్ కదలికలు, ఎవరెవరికి కలుస్తున్నారు? ఏం చేస్తున్నారు అన్న విషయాలపై కూడా ఏపీ సీఐడీ ఆరాతీస్తోందని అంటున్నారు. అలాగే హస్తిన కేంద్రంగా స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ లోకేష్ జాతీయ స్థాయిలో అందరి మద్దతు, సంఘీభావం కూడగడుతున్న నేపథ్యంలో ఈ కేసులో చంద్రబాబు అరెస్టుపై ఏపీ సీఐడీ కూడా తన వాదన మీడియా వేదికలపై చెప్పేందుకు కూడా సమాయత్తమౌతున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే  ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ చంద్రబాబు అరెస్టుపై, తమ దర్యాప్తులో తేలిన అంశాలపై నిబంధనలను కూడా పక్కన పెట్టి మీడియా ఎదుట మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ బృందం శుక్రవారం ( అక్టోబర్ 22) హస్తినకు బయలుదేరనుండటం సర్వత్రా ఆసక్తినీ, ఉత్కంఠనూ రేకెత్తిస్తోంది.