ఏపీ రాజధాని: అన్ని దారులూ అమరావతి వైపే!

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడ పరిసరాల్లో ఉంటుందని ప్రకటించిన తర్వాత ఆంధ్రుల తొలి రాజధాని, సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతి వైపే రాజధాని వుండే అవకాశాలు వున్నాయన్న అభిప్రాయాలు వినిపించాయి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కృష్ణానదికి అవతలి వైపునే రాజధాని వుంటుందని స్పష్టంగా ప్రకటించడం కూడా అమరావతి ప్రాంతం రాజధాని అయ్యే అవకాశాలు వున్నాయన్న అంచనాలకు మరింత బలం చేకూరింది.

 

పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.... అమరావతి ప్రాంతానికి రాష్ట్రానికి రాజధాని అవ్వడానికి అన్ని అర్హతలూ వున్నాయి. ముఖ్యంగా అమరావతి ప్రాంతం రాజధాని కావడం అనేది వాస్తు పరంగా అద్భుతం. ఎందుకంటే అమరావతికి ఈశాన్యం చాలా పల్లంగా వుంటుంది. పైగా కృష్ణానది నిరంతరం ప్రవహిస్తూ వుంటుంది. అలాగే అమరావతి ఈశాన్య భాగంలో పెద్ద రిజర్వాయర్ వుంది. ఆ విధంగా ఈశాన్యంలో సహజసిద్ధంగానే నీటి నిల్వలు వుండటం ఎంతో మంచిది. మరో విషయం గురించి ఆలోచించకుండానే ఏకగ్రీవంగా అమరావతి ప్రాంతాన్ని రాజధాని చేయడానికి ఈ ఒక్క కారణం చాలు. ఈ కారణంతోపాటు మరెన్నో కారణాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్గాలు అమరావతి వైపు పయనించడానికి కారణం అవుతున్నాయి.

 

అమరావతి పరిసరాల్లో అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్‌భవన్... ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సరిపడా ప్రభుత్వ భూములు వున్నాయి. కృష్ణాతీరంలో వున్న అమరావతిని రాజధానిగా చేయడం వల్ల రాజధానికి నీటి సమస్య కూడా వుండదు. ఇప్పటికే ప్రభుత్వం అమరావతి మీద ట్రాఫిక్ ఒత్తిడి పడకుండా రింగ్ రోడ్లను ప్లాన్ చేసింది. విజయవాడ పరిసరాలు మొత్తం అభివృద్ధి చెందేలా, అమరావతి మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసేలా ఈ ప్రణాళిక వుంది.

 

అలాగే అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కి రాజధానిని చేసిన తర్వాత ఆ ప్రాంతంలో రవాణా సదుపాయాలను పెంచడానికి కూడా ప్రభుత్వం ఇప్పటికే పక్కా ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కృష్ణానదిపై రెండు భారీ వంతెనలను నిర్మించడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

 

అమరావతి అనాది నుంచి సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. బౌద్ధ సంస్కృతి విలసిల్లిన అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అభివృద్ధి చేసినట్టయితే వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడానికి సిద్ధంగా వున్నట్టు బౌద్ధ గురువు దలైలామా రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే బౌద్ధాన్ని పాటించే జపాన్ కూడా అమరావతి రాజధాని అయినట్టయితే రాజధాని అభివృద్ధికి భారీ స్థాయిలో సహకరిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. రాజధాని పేరు కూడా బౌద్ధ ధర్మాన్ని అనుసరించి పెట్టినట్టయితే తమ నుంచి మరింతగా సహకారం అందుతుందని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇన్ని అనుకూల అంశాలు వున్నాయి కాబట్టే అందరి ఆలోచనలూ ‘అమరావతి’ అమరావతి చుట్టూ తిరుగుతున్నాయి. అన్ని దారులూ అమరావతి వైపు వెళ్తున్నాయి.