అందుకే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాము
posted on May 8, 2015 2:44PM
.jpg)
‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా’ అనే మాట వినగానే ఎవరికయినా టక్కున గుర్తుకు వచ్చేది కేంద్రమంత్రి వెంకయ్యనాయుడే. ఎందుకంటే గత మూడు నాలుగు నెలల క్రితం వరకు ఈ ప్రత్యేక హోదా గురించి అందరి కంటే ఎక్కువగా మాట్లాడింది ఆయనే గాబట్టి. అందుకే ఇప్పుడు అందరూ ఆయననే నిందిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారం కోసం తననే టార్గెట్ చేసుకొంటున్నాయని ఆయన కూడా వాపోయారు.
ప్రత్యేక హోదా గురించి మొన్న డిల్లీలో తన ఇంటి ముందు కొందరు ఆందోళన చేసినప్పుడు ఆయన వారి ముందు ఒక బ్రహ్మ రహస్యం బయటపెట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా కోరుకొంటున్నప్పటికీ 14వ ఆర్ధిక సంఘం అందుకు అభ్యంతరం చెప్పిందని ఆయన తెలిపారు. అందుకే ప్రత్యేక హోదా ఇవ్వడం కష్టం అవుతోందని ఆయన తెలిపారు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా ఇవ్వాలని తాను కూడా కోరుకొంటున్నానని, అందుకోసం గట్టిగా ప్రయత్నిస్తున్నానని ఆయన తెలిపారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్ధిక సంఘం అభ్యంతరం చెప్పిందన్న విషయాన్ని ఆయనతో సహా ఇంతవరకు ఎవరూ కూడా బయటపెట్టలేదు. అందరి కంటే ముందు ఆర్ధిక సంఘమే అడ్డుపడుతున్నప్పుడు ఇంక ఇరుగు పొరుగు రాష్ట్రాలను ఆడిపోసుకోవడం అనవసరం. దేశంలో అనేక రాష్ట్రాలలో ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయని వాదించడం కూడా అనవసరం. అయితే ఈ అంశం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎంత కాలం నాన్చితే అంత వారికే నష్టం జరుగుతుందని రెండూ గుర్తుంచుకోవాలి. ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనుకొంటే అదే విషయం ప్రజలకు, ప్రతిపక్షాలకు నచ్చజెప్పి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, వాటి అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమయిన సబ్సీడీలు, ప్రోత్సహకాలు ప్రకటిస్తే మంచిది.