రాజధాని నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తే...

 

 

రాష్ట్రంలో మరే ఇతర సమస్యలు లేనట్లుగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ రాజధాని భూముల చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ వద్ద రాజధాని నిర్మించబోతునప్పుడు స్వాగతించిన కాంగ్రెస్, వైకాపాలు, ఇప్పుడు రాజధాని రైతుల హక్కుల పరిరక్షణ కమిటీల ముసుగులో గ్రామాలలో పర్యటిస్తూ రైతులలో లేని పోనీ అనుమానాలు, భయాందోళనలు సృష్టిస్తూ భూసేకరణకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తుండటం చాలా దురదృష్టకరం. అయితే తాము రైతుల హక్కులను కాపాడేందుకే ప్రయత్నిస్తున్నాము తప్ప రాజధాని నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు సృష్టించడం లేదని సమర్ధించుకొంటున్నారు.

 

ఆ విషయం గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులను, స్థానిక యంపీ, యం.యల్యేలను కూడా గ్రామాలలో పర్యటించి రైతుల సందేహాలు తీర్చి, వారికి ప్రభుత్వం తరపున పూర్తి భరోసా కల్పించమని ఆదేశించారు. వారు తమకు అప్పగించిన బాధ్యత చాలా సమర్ధంగానే నిర్వహించారని చెప్పవచ్చును.

 

లక్షలు పలికే భూములకు ఎక్కడి నుండో వచ్చిన వ్యాపారులు ఇప్పుడు కోట్లు ఎందుకు ఆఫర్ చేస్తున్నారో? ఆలోచించుకోవాలని వారు రైతులను కోరారు. రాజధాని ఇక్కడ నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయం వలననే రైతుల భూముల ధరలు పెరిగాయని, అందువల్ల ఎవరి చెప్పుడు మాటలకో చెవొగ్గి అయినకాడికి భూములను అమ్ముకోవద్దని, రైతులు అన్నివిధాల లాభాపడేలా, వారి జీవితాలకు పూర్తి భద్రత, భరోసా కలిగేవిధంగా ప్రభుత్వమే భాద్యత తీసుకొంటుందని హామీ ఇచ్చారు. మంత్రులు చెప్పిన ఆ మాటలు రైతులకు బాగా చేరింది.

 

అప్పటి నుండే రైతులలో నెలకొన్న భయాందోళనలు క్రమంగా తగ్గు ముఖం పట్టి, ఒక్కో గ్రామంలో రైతులు స్వచ్చదంగా తమ భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు ముందుకు వస్తున్నారు. రైతులు కోరుతున్న విధంగా 1000 గజాల స్థలానికి బదులు రాజధాని నగరంలో అన్ని విధాల అభివృద్ధి చేయబడిన 1200గజాల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

రైతన్నలను భయాందోళనలు రేకెత్తించి, వారు రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వకుండా అడ్డుకోగలిగితే, రాజధాని నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంలో ముందుకీ, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి కలుగుతుందని భావించిన ప్రతిపక్షాలకు ఇది ఊహించని పరిణామమేనని చెప్పవచ్చును. కానీ వారి ప్రయత్నాలు వారు ఇంకా చేస్తూనే ఉన్నారు.

 

సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు, స్థానిక శాసనసభ్యులు గ్రామాలలో పర్యటించనంత కాలం, ప్రభుత్వం ఎక్కడో హైదరాబాద్ లో ఏసీ గదుల్లో కూర్చొని భూసేకరణ గురించి మాట్లాడుతున్నారని విమర్శించిన ప్రతిపక్షాలు, ఇప్పుడు వారు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి, రైతుల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తూ వారిలో నెలకొన్న భయాందోళనలను తొలగించి భూసేకరణకు మార్గం సుగమం చేస్తుంటే, అధికార పార్టీ నేతలు రైతన్నలను బెదిరించి, భయపెట్టి భూములు స్వాధీనం చేసుకొంటున్నారనే మరో కొత్త ప్రచారం మొదలుపెట్టి, రైతన్నలకు అండగా నిలబడతాము అంటూ ప్రతిపక్ష నేతలు గ్రామాలలో పర్యటిస్తున్నారు.

 

అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ రాజకీయ చదరంగం ఇలా సాగుతుంటే, గన్నవరం మండలంలో గల అజ్జంపూడి, బుద్దవరం, దావాజీ గూడెం మరియు కేసరపల్లి గ్రామాలకు చెందిన రైతులు నిర్వహించిన గ్రామసభలో చేసిన తీర్మానం చాలా ఆసక్తికరంగా ఉంది.

 

కొత్త రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం మండలంలో గల ఆ నాలుగు గ్రామాల నుండి మొత్తం 406 ఎకరాల భూమిని సేకరించేందుకు కొన్నిరోజుల క్రితమే ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. చట్ట ప్రకారం భూసేకరణకు ఎంత పరిహారం చెల్లించవలసి ఉంటుందో అంతా ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొంది. కానీ తూళ్ళూరు మండలంలో రాజధాని కోసం భూములు ఇస్తున్న రైతులకు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఏవిధమయిన నష్టపరిహారం ఇస్తోందో అదే విధంగా తమకు పరిహారం ఇవ్వాలని నిన్న గ్రామ సభలో రైతులు తీర్మానించారు. తూళ్ళూరులో రైతులు రాజధాని కోసం భూములు ఇస్తుంటే, తాము రాజధానికి అవసరమయిన విమానాశ్రయ విస్తరణకు భూములు ఇస్తున్నాము కనుక తమకూ అదేవిధంగా పరిహారం చెల్లించాలని వారు తీర్మానించారు.

 

వారి డిమాండ్ల మాట ఎలా ఉన్నప్పటికీ వారు చేసిన ఆ తీర్మానం తూళ్ళూరు రైతులకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం మరియు ప్యాకేజీ చాలా బాగుందనే విషయాన్ని ద్రువీకరిస్తోంది. అందుకే తమకూ అటువంటి మంచి ప్యాకేజీయే ఇవ్వాలని గన్నవరం మండలం రైతులు కూడా కోరుతున్నారని అర్ధమవుతోంది. అంటే తూళ్ళూరు మండలంలో తెదేపా నేతలు, యం.యల్యేలు. రైతన్నలను బెదిరించి, భయపెట్టి భూములు స్వాధీనం చేసుకొంటున్నారని కాంగ్రెస్, వైకాపాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిగట్టుకొని విష ప్రచారం చేస్తున్నట్లు కూడా స్పష్టమవుతోంది.

 

నిన్న మొన్నటి వరకు దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా పేరు పొందిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పుణ్యమాని రాజధాని లేని దుస్థితిలో ఉందిపుడు. అందుకు కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా పశ్చాత్తాప పడకపోవచ్చును, సిగ్గుపడకపోవచ్చును. కానీ రాజధాని లేదని చెప్పుకోవలసిరావడం ఆత్మాభిమానం ఉన్న ప్రతీ తెలుగు వ్యక్తికీ చాలా సిగ్గు, బాధ కలిగిస్తుంటుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీలయినంత త్వరగా రాష్ట్రానికి రాజధాని నిర్మించాలనే పట్టుదలతో కృషి చేస్తున్నారు.

 

రాష్ట్ర పరిస్థితిని అర్ధం చేసుకొని ఆయనకు సహకరించాల్సిన ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించడం క్షమార్హం కాదు. తమ అభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు. అదేవిధంగా ఇప్పడు రాజధాని నిర్మాణానికి అడ్డుపడుతున్న వారికి ప్రజలు అదే విధంగా బుద్ధి చెప్పగలరనే సంగతి వారు గ్రహిస్తేమంచిది.