సెలబ్రిటీల ఫోజులతో స్వచ్చ భారత్ సాధ్యమవుతుందా?

 

ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ‘స్వచ్చ భారత్’ కార్యక్రమానికి ఊహించినట్లే సినీ తారలు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల నుండి మంచి స్పందన వస్తోంది. నిత్యం దేశంలో ఏదో ఒక చోట ఎవరో ఒక ప్రముఖుడు చీపురు పట్టుకొని రోడ్లు ఊడ్వడం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇదొక మహా యజ్ఞంలా సాగుతోందని బీజేపీ దాని మిత్రపక్షాలు భావిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఇటువంటి కార్యక్రమాలు గాంధీ, నెహ్రుల కాలం నుండే తమ పార్టీ అమలు చేసిందని, అందువలన మోడీ కొత్తగా చేస్తున్నదేమీ లేదని వి హనుమంతరావు వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మోడీ చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు ‘ఓస్ ఇంతేనా...’అంటూ తేలికగా తీసిపారేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు ఒబామా అంతటివాడు మోడీ మాటల మనిషి కాదు చేతల మనిషి అని మెచ్చుకొన్న సంగతి మాత్రం వారు ప్రస్తావించరు. అలాగని పారిశుద్యం గురించి మోడీ ప్రభుత్వం గనుక పట్టించుకోకపోతే, అప్పుడు ఇదే కాంగ్రెస్ నేతలు ‘అదే మా ప్రభుత్వమయితేనా...’అంటూ తప్పకుండా దీర్గాలు తీసేవారు.

 

ఎవరు ఏవిధంగా అనుకొన్నప్పటికీ ఒక ప్రభుత్వాధినేతకు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన రావడం, దానిని అమలుచేసేందుకు గట్టిగా కృషి చేస్తూ ఆ ప్రయత్నంలో తెలివిగా ప్రజలలో స్ఫూర్తి రగించగల సెలబ్రిటీల సహకారం కోరడం చాలా మంచి ఆలోచన. అందుకు మోడీని మెచ్చుకోవలసిందే. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సెలబ్రిటీలలో ఎందరు మోడీకున్న ఆ స్పూర్తిని కనబరుస్తున్నారు? ఎందరు తమ అభిమానులలో ఆ స్పూర్తిని రగిలించగలిగారు? ఒకసారి చీపురు పట్టుకొని నాలుగు ఫోటోలు తీయించుకోవడం వలన ఏమి ప్రయోజనం? వారు చీపురు పట్టుకొంటే మిగిలినవారు కూడా వారి వెనుకే నిలబడి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వలన ఏమి ప్రయోజనం? అని తమను తాము ప్రశ్నించుకోవలసి ఉంది.

 

ఆనాడు మహాత్మాగాంధీ ఎక్కడో డిల్లీ నుండో లేకపోతే గుజరాత్ లో ఏ మారుమూల గ్రామం నుండో ఒక చిన్న పిలుపునిస్తే యావత్ దేశ ప్రజలు ఉద్యమంలో పాల్గొనడానికి తండోపతండాలుగా కదిలి వచ్చేవారు. కానీ ఇప్పుడు దేశ ప్రజలలో ఆ స్ఫూర్తి, ఆ ఉత్సాహం కరువయింది గనుక వారిలో ఆ స్ఫూర్తి రగిలించడానికి సెలబ్రేటీలు ఏదో మొక్కుబడిగా కాకుండా చాలా చిత్తశుద్ధితో కృషి చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఏ కార్యక్రమమయినా విజయవంతం అవుతుంది.

 

మన ప్రభుత్వాలు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఎంతమంది సెలబ్రేటీలు ఎన్ని చీపుర్లు అరగదీసినా, ప్రజల అలవాట్లు, ఆలోచనా తీరు మారనంత కాలం స్వచ్చ భారత్ సాధించడం చాలా కష్టం. కనుక సెలబ్రిటీల చేత రోడ్లు ఊడ్పించడం కంటే వారిద్వారా ప్రజలలో పరిశుభ్రత పట్ల చైతన్యం కలిగించడం వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుందని తెలుసుకోవాలి. లేకుంటే ఒకవైపు సెలబ్రేటీలు చెత్త ఊడ్చి పోతుంటే, మరోవైపు ప్రజలు రోడ్ల మీద చెత్త పోస్తూనే ఉంటారు. దాని వలన వారి కృషి బూడిదలో పోసిన పన్నీరవుతుంది.

 

చైనా, జపాన్, అమెరికా తదితర దేశాలు ఒలింపిక్స్ క్రీడలలో డజన్ల కొద్దీ వెండి బంగారు పతకాలు పట్టుకుపోతూ, భారత్ వంటి దేశాలకు కేవలం కాంశ్య పతకాలను మాత్రమే మిగుల్చుతుంటాయి. అందుకు కారణం ఏమింటంటే ఆ దేశాలు తమ పిల్లలను బాల్యం నుండే క్రీడలలో ప్రోత్సహిస్తూ, వారికి తగిన శిక్షణ ఇస్తూ మేటి క్రీడాకారులుగా మలుచుకొంటాయి. వాటికి అంతటి నిబద్దత, దూరదృష్టి ఉండబట్టే ఆ దేశాలు అన్నేసి బంగారు పతకాలు గెలుచుకోగలుగుతున్నాయి.

 

కనుక, మన దేశంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నప్పటి నుండే పిల్లలకు స్కూళ్ళలో పరిశుభ్రత, ఆరోగ్యం, క్రీడలు, కళలు తదితర రంగాలలో వారి ఆసక్తిని బట్టి తగిన శిక్షణ, మగ పిల్లలకు స్త్రీలపట్ల గౌరవం, ఆడపిల్లల్లో న్యూనతాభావం తొలగించడం వంటివన్నీ నేర్పించడం మొదలుపెడితే, సమాజంలో మార్పులు సహజంగా మొదలవుతాయి. నేలలో మొక్కవేసి ఊరుకొంటే సరిపోదు. దానికి నిత్యం నీరందించగలిగినప్పుడే అది పెరిగి ఫలాలు ఇస్తుంది. అదేవిధంగా ఒక గొప్ప ఆశయాన్ని ఆచరణలో పెట్టి దానిని విజయవంతంగా అమలుచేయాలంటే అందుకు దీర్గకాలిక ప్రణాళిక, ప్రజల సహకారం కూడా చాలా అవసరం అని ప్రభుత్వాలు గుర్తించాలి.