ప్రధాని మోడీ సమావేశానికి వారిద్దరూ డుమ్మా?
posted on Jul 16, 2015 9:16AM
.jpg)
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన డిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానికి అనేక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాకుండా ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంతరులు కూడా డుమ్మా కొట్టారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రిని కలిసే ఎటువంటి అవకాశాన్ని సాధారణంగా వదులుకోరు. కనుక ఆయన డిల్లీ వెళ్ళాలనే అనుకొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుష్కరాలలో మొదటిరోజే త్రొక్కిసలాటలో ఏకంగా 27మంది మరణించడంతో ఆయన తనకి బదులు ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణా రావుని డిల్లీకి పంపారు. పుష్కరాలలో జరిగిన దుర్ఘటన గురించి ప్రధాన మంత్రి స్వయంగా చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు కనుక ఆయన రాలేకపోవడాన్ని అర్ధం చేసుకోగలరు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీకి వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ వెళ్ళకపోవడం రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది.
ఓటుకి నోటు కేసులో తన ప్రభుత్వాన్ని అడుగు ముందుకు వేయలేకపోవడం, ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో బీజేపీ నేతలని మాట్లాడనీయకుండా చేయడం, సెక్షన్: 8ని అమలుచేయబోతున్నట్లు సంకేతాలు పంపడం, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణకు అరకొర నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేస్తుండటం వంటి కారణాల చేతనే కేసీఆర్ కూడా పుష్కరాల వంక పెట్టుకొని ఈ సమావేశానికి డుమ్మా కొట్టి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తూన్నారు.
ఓటుకి నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, సెక్షన్: 8పై రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భీకర యుద్ధం నడుస్తున్న సమయంలో కేసీఆర్ తన కుమారుడు మరియు రాష్ట్ర ఐ.టి.శాఖ మంత్రి కె.తారక రామారావుని డిల్లీ పంపించారు. కానీ రాష్ట్రాలకు నిధులు కేటాయించే మఖ్యమయిన అంశంపై ప్రధానమంత్రి స్వయంగా నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ డుమ్మా కొట్టడం విశేషం. బహుశః ఆయన ఆ విధంగా కేంద్రానికి తన అసమ్మతిని తెలియజేయాలనుకొన్నారేమో? కానీ ఏవో కారణాల చేత ఇటువంటి కీలక సమావేశానికి కేసీఆర్ వెళ్ళకపోవడం వలన రాష్ట్రానికి నష్టం కలిగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రులకి కేంద్రంపై ఎటువంటి అభిప్రాయాలున్నప్పటికీ, కేంద్రంతో ఎల్లప్పుడూ సత్సంబంధాలు నిలుపుకొన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.