గుండె జబ్బుల సమస్యలపై అవగాహన

 

చిన్న వయసులోనే గుండెజబ్బులు రావడం... అది గుండెపోటుకు దారితీయడం ఇప్పుడు మరింత పెరిగింది. మనదేశంలో ప్రతి ఏడాదీ కొత్తగా 14 లక్షల నుంచి 16 లక్షలమంది గుండెజబ్బులు ఉన్నవారి జాబితాలో చేరుతున్నారు. ఇటీవల మనలో పెరుగుతున్న పాశ్చాత్య తరహా ఆహార అలవాట్లు, వేగంగా కొనసాగుతున్న నగరీకరణతో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాంతో చిన్న వయసులోనే గుండెజబ్బులు (కరోనరీ ఆర్టరీ డిసీజెస్) పెరుగుతున్నాయి. ఆహార అలవాట్లలో, జీవనశైలిలో కొద్దిపాటి మార్పులతో ఆ గండాన్ని చాలావరకు నివారించవచ్చు. ఆ ముందుజాగ్రత్తలు తెలుసుకోవడం చాలా అవసరము.

నివారణ :

వృత్తిపరంగా శరీరానికి తగినంత శ్రమ లేని వాళ్లు నడక, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. రోజులో కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. యుక్తవయస్కులు రన్నింగ్, ఈత వంటి వ్యాయామాలు చేయడం గుండెకు ఆరోగ్యాన్నిస్తుంది. చక్కెర, రక్తపోటు ఉన్నవాళ్లు తప్పనిసరిగా వాకింగ్ వంటి ఎక్సర్‌సైజ్ చేస్తూ తమ చక్కెరపాళ్లను, రక్తపోటును అదుపులోపెట్టుకోవాలి.

పొగతాగడం గుండెపోటుకు ప్రధాన కారణం. దాన్ని తక్షణం ఆపేయాలి. పొగాకు వినియోగం ఏ రూపంలో ఉన్నా దాని వల్ల గుండెకు ప్రమాదం అని గుర్తించాలి. పొగాకులోని రసాయనాలు రక్తపోటును, గుండెవేగాన్ని పెంచి, రక్తంలోని ఆక్సిజన్ పాళ్లను తగ్గిస్తాయి. అందువల్ల పొగాకు ఏ రూపంలో ఉన్నా ప్రమాదమే.

అధికర రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియువూలు తప్పనిసరిగా పాటించాలి. హైబీపీని నివారించే ఆహార నియమాలను ‘డ్యాష్’ అంటారు. ‘డయుటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’ అన్న వూటలకు సంక్షిప్తరూపమే ఈ డ్యాష్. హైబీపీ ఉన్నవాళ్లు... పళ్లు, కూరగాయులు, ఆకుకూరలు పుష్కలంగా తీసుకోవాలి. ఉప్పు (సోడియుం) తగ్గించాలి. బరువు పెరక్కుండా చూసుకోవాలి. హై బీపీ ఉంటే దాన్ని నియుంత్రించుకోవడం కోసం జీవన విధానం (లైఫ్‌స్టైల్) లో వూర్పులు పాటించాలి. అంటే... ఉప్పుతో పాటు సోడియుం పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలైన నిల్వ ఆహారం (ప్రిజర్వ్‌డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. అలాగే తాజాపళ్లు, పొట్టు ఉన్న తృణధాన్యాలు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

 

 

కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్ తీసుకోకూడదు. కొలెస్ట్రాల్, నూనెలు తక్కువగా తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసొనను తీసుకోకూడదు. తాజా పళ్లు, ఆకుపచ్చటి కూరగాయలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్) చాలా మంచివి. వేటమాంసం (రెడ్ మీట్), కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉండే పాల ఉత్పాదనలు, వెన్న, కొబ్బరి లాంటివి తీసుకోకపోవడమే మంచిది.


మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకు యోగా, ప్రాణాయామం వంటివి చేయవచ్చు. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు విధిగా నిద్రపోవాలి.


మీ నడుం కొలతను ఒకసారి పరీశీలించుకోండి. మీరు పురుషులైతే మీ నడుం కొలత 40 అంగుళాల కంటే ఎక్కువగా, స్త్రీలు అయితే 35 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటే మీకు గుండెజబ్బుల రిస్క్ ఎక్కువ అని గుర్తించండి.


పైన పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్, స్థూలకాయం, నడుం కొలత పెద్దదిగా ఉండటం వంటివి ఉన్నవారు యుక్తవయస్కులైనా ఒకసారి కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన మేరకు పరీక్షలు చేయించుకుని నిశ్చింతగా ఉండవచ్చు.

 

జాగ్రత్తలు :

నూనెల్లో పాలీ అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ - (ప్యూఫా) అంటే పొద్దుతిరుగుడు నూనె, కుసుమనూనెల్లాంటివి; మోనో అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (మ్యూఫా) - అంటే ఆలివ్ నూనె, వేరుశనగ నూనెలనుమార్చి మార్చి తీసుకోవడం వల్ల గుండెకు ఆరోగ్యం.

శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అయిన నెయ్యి, వెన్న, పామాయిల్ చాలా తక్కువ పాళ్లలో తీసుకోవాలి.

వంట వండే విధానం కూడా గుండెజబ్బులకు దోహదపడుతుంది. నూనెలో వేగాక మంచి కొలెస్ట్రాల్ సైతం చెడు కొలెస్ట్రాల్‌గా మారిపోతుంది. కాబట్టి వేపుళ్లను సాధ్యమైనంతగా తగ్గించాలి. ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ వాడకూడదు.

ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే తాజా పళ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి.

బర్గర్ వంటి బేకరీ ఐటమ్స్‌కు బదులు ఆరోగ్యకరమైన సంప్రదాయ ఆహారాలు... కిచిడి, పొంగల్, ఇడ్లీ వంటివి మంచిది. మొలకెత్తిన ధాన్యాలు (స్ప్రౌట్స్) తీసుకోవాలి.

అప్పడాలు, పచ్చళ్లు, కారపు వస్తువుల్లో ఉప్పు ఎక్కువ కాబట్టి వాటిని చాలా పరిమితంగా తీసుకోవాలి