చనిపోయేముందు కూడా స్నేహితుడికి సాయం
posted on Aug 30, 2018 4:28PM
రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణ అంతిమ యాత్ర ముగిసింది.. ఆయనకు సంతాపం తెలపటానికి వచ్చిన స్నేహితులు, సన్నిహితులు ఆయన మంచితనం గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకుంటున్నారు.. హరికృష్ణ మంచితనం, సాయం చేసే గుణం గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా హరికృష్ణ స్నేహితుడు ఒకరు ఆయన చనిపోవడానికి కొన్ని రోజుల క్రితం చేసిన సాయాన్ని గుర్తుచేసుకున్నారు.

హరికృష్ణ హైదరాబాద్ అబిడ్స్‌లోని తన ఆహ్వానం హోటల్‌ను ఆర్థిక కష్టాల్లో ఉన్న తన స్నేహతుడికి రెండు నెలల క్రితం లీజుకు ఇచ్చారట.. స్నేహితుడు కృష్ణారావు వ్యాపారంలో నష్టపోయారు.. దీంతో ఆయనను పిలిచి హోటల్‌ను అద్దెకు ఇచ్చి, ఆర్థికంగా కుదురుకునేందుకు సహాయం చేసారని సమాచారం.. స్నేహితుడిని తన ఇంటికి పిలిపించుకొని ఇబ్బందుల్లో ఉన్నావని బాధపడవద్దు, తోచిన సహాయం చేస్తానని చెప్పి, లీజుకు ఇచ్చారని తెలుస్తోంది.. ఈ హోటల్ బాగా నడుస్తోందని, దీంతో నీ ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని సూచించారట.. ఈ విషయాన్ని కృష్ణారావు గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు.