శుక్రవారం నమాజ్ కు మసీదుకు వెళ్లకపోతే...

మనలో ఐదు పూటలా నమాజ్ చదివటం ప్రక్కన పెడితే ప్రత్యేకంగా పనికట్టుకుని శుక్రవారాలు మాత్రమే మసీదుకు వెళ్లి సెంటిమెంట్ గా నమాజ్ చదివేసేవారి సంఖ్యే ఎక్కువ! అందుకే మిగతా రోజుల్లో పెద్దగా జనాల్లేక బోసిపోయి ఉండే మసీదులు శుక్రవారాలు మటుకు ఒక్కసారిగా కోలాహాలంగా మారుతుంటాయ్.

కాబట్టి పై సంఘటనలను దృష్టిలో పెట్టుకుని “నేను మసీదుకే కదా వెళుతుంది అలాంటప్పుడు కరోనా వైరస్ నన్ను ఏమి చెయ్యగలదు అల్లాహ్ యే అన్నీ చూసుకుంటాడని మొండిగా వెళ్లటం అన్నది చాలా తప్పు.

ఎందుకంటే అనేక సార్లు వైరస్ ల బారిన పడే హజ్ కు ప్రపంచ నలుమూలల నుండి వెళ్లినోళ్లే  వేల కొద్దీ హాజీలు చనిపోవటం జరిగింది. వారంతా కూడా అల్లాహ్ ను నమ్ముకునే కదా  వెళ్లింది హజ్ చెయ్యటానికి పైగా కాబా దర్శనానికి.

ఇదంతా విధి ప్రకారమే జరిగినప్పటికీ మన ద్వారా ఇతరులకు హాని తలపెట్టకుండా జాగ్రత్త వహించటం అన్నది మన విధి. “ఆ ఏముందిలే పోయే ప్రాణం ఎలాగూ పోతుంది కదా” అని అశ్రద్ధ వహించటం కేవలం మీ ప్రాణాల వరకే కాదు ఇతరుల ప్రాణాలను కూడా మీరు ప్రమాదంలో నెట్టటమే అవుతుంది.

ఓ ప్రక్క ప్రభుత్వాలు కోట్లు నష్టం పెట్టుకుని దేశాలూ, పట్టణాలే వ్యక్తుల మధ్య సామాజిక దూరం (Social Distance) పెంచి కరోనాను కట్టడి చేయటానికి గృహ నిర్భంధం (Lock down) ప్రక్రియ మొదలు పెడితే మనం దానిలో  కచ్చితంగా భాగస్వామ్యం కావాలి. కొద్ది కాలం సామూహిక, శుక్రవారం నమాజులు మసీదులకు వెళ్లకపోయినా పర్లేదు. ఇళ్ళల్లో వ్యక్తిగతంగా చదువుకున్నా తప్పులేదు. ఎదురుగా ఓ ప్రమాదకరమైన కారణం ఉంది కాబట్టి. ఇప్పుడు కరోనా వచ్చింది రేపన్న రోజు ఏ భయంకర తుఫానో వచ్చి సగం ఊరు ముంగిపోతే సామూహిక నమాజ్ కోసం మసీదుకు వెళ్లగలరా? ఇదీ అంతే!  

కరోనా వైరస్ కున్న ఓ ప్రత్యేకత,  అది ఏ వ్యక్తికి సోకినా  వెంటనే దాని లక్షణాలు బయటపడటం మొదలవ్వవు. 11 నుండి 14 రోజుల తరువాత నుండి దాని లక్షణాలు ఒకొక్కటిగా బయటపడతాయి. ఈ లోపులో బయట పరిసరాల్లో అతను  అప్రయత్నంగా తుమ్మటం, దగ్గటం ద్వారా తుప్పర్ల నుండి వెలువద్ద వైరస్ వివిధ వస్తువుల ఉపరితల (Surface) భాగంపై పడి, మూడురోజులకు  పైనే అది సజీవం (Live) గా ఉంటుంది. ఆ ఉపరితలాలను అప్రయత్నంగా తాకే ఇతరులకు ఆ వైరస్ అమాంతంగా అంటుకుంటుంది. అందుకే చేతులు కడుక్కోమనేది.

అలా అంటుకునే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలకు పాకి దాదాపు ఐదు లక్షల మందికి సోకి ఎన్నో వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయ్. కాబట్టి మసీదులకు వచ్చే వారిలో ఎంతమందిలో వారికి తెలియకుండా కరోనా వైరస్ ఉందో తెలియదు కదా! వారు ఏ కాస్త చిన్నగా దగ్గినా, తుమ్మినా చాలు ఆ మసీదులో ఉన్నోల్లందరూ తమకు తెలియకుండా కరోనా బారిన పడతారు.

కాబట్టి మనం దేవునిపై బలమైన విశ్వాసాలు కలిగి ఉండటంలో తప్పులేదు, కానీ ఆ విశ్వాసాలను  మొండిగా కలిగి ఉండకూడదు. పరిస్థితులు సహకరించనప్పుడు ప్రాణాల్ని సంకటంలో పడవేసి మొండిగా విశ్వాస నిరూపణ చేసుకోమని దేవుడు ఎక్కడా చెప్పలేదు కదా! ఎందుకంటే మనిషి శ్రేయస్సు కోసమే ధర్మం ఉంది ధర్మం కోసం కోసం మనిషి కాదు.

ఇవేమీ పట్టించుకోకుండా నాకు నా విశ్వాసమే ప్రధానమని చెప్పి నేను పట్టిందానికి మూడే కాళ్లు అన్న చందంగా, ఎవరెన్ని చెప్పినా వినకుండా మొండిగా వ్యక్తుల సమూహాల్లోకి వెళ్ళిపోయి కరోనా తగిలించుకుని రేపన్నరోజున ఐసోలేషన్ వార్డ్  బెడ్ మీద పడుకుని చివరి రోజులు లెక్క పెడుతూ బాధపడేకంటే ఇప్పుడే జాగ్రత్త పడి మన ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను రిస్క్ లో పెట్టక పోవటం ఎంతో పుణ్యం...

మన వీధి చివర్లో ఉండే మసీదుల సంగతి ప్రక్కనపెడితే గత 1400 సం.ల కాలంలో మక్కాలో ఉన్న కాబా మసీదునే అనేక కారణాల వల్ల 40 సార్లు పూర్తిగా మూసివెయ్యటం జరిగింది! ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! అవును గతంలో ఎన్నో సార్లు ఇప్పుడొచ్చిన కరోనా లాంటి వివిధ వైరస్ ల కారణంగా  ఉమ్రాలను మాత్రమే కాదు, హజ్ లను సైతం ఆపేసి, మొత్తానికి కాబా మసీదునే కొద్ది కాలం మూసివేసే  పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని ఎంతమందికి తెలుసు?

ఇది నిజం. 1814 సం.లో మక్కాలో ప్లేగ్ వ్యాధి ప్రబలి 8000 మంది చనిపోయారు. అప్పుడు తవ్వాఫ్, సామూహిక నమాజ్ లను కొద్ది కాలం ఆపేసి, మస్జిదే హరామ్ ను పూర్తిగా కొద్దికాలం మూసివెయ్యటం (Lock down) జరిగింది.

1831 లో భారతదేశం నుండి వెళ్ళిన ఒక వ్యక్తి ద్వారా సోకిన వింత వైరస్ ద్వారా ఆ సంవత్సరం హజ్ కొచ్చినవారిలో మూడొంతుల్లో ఒక వంతు మంది చనిపోయారు. అప్పుడు కూడా మస్జిదే హరామ్ ను పూర్తిగా కొద్దికాలం మూసివెయ్యటం (Lock down) జరిగింది.

1837 లో ఒక ప్రమాదకరమైన వైరస్ మక్కా, మదీనా పట్టణాల్లో విలయతాండవం చేసింది. అది దాదాపు మూడేళ్ల వరకు అనేక మందిని పొట్టన పెట్టుకుని 1840 లో అది తగ్గు ముఖం పట్టింది. అప్పుడు కూడా కూడా మస్జిదే హరామ్ ను పూర్తిగా మూసివెయ్యటం (Lock down) జరిగింది.

1845 సం.లో “కొలీరా” అనే పేరు గల వైరస్ మక్కాలో వ్యాప్తి చెందింది, తరువాత 1864, 1892 సం. రాలలో సైతం ఒక విధమైన ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెంది వేల కొద్దీ హజ్ యాత్రికులు చనిపోయారు. ఆయా సంవత్సరాల్లో కూడా కాబా మసీదు ను  పూర్తిగా మూసివెయ్యటం జరిగింది.
 
కాబట్టి ఇప్పుడు కరోనా వైరస్ వచ్చి కొద్ది కాలం మక్కా మసీదు  లో ఉమ్రాను తాత్కాలికంగా ఆపెయ్యటం అదేదో పెద్ద విచిత్రమేమీ కాదు, అలా అంటువ్యాధుల కారణంగా మసీదును కొద్ది కాలం పాటు మూసివెయ్యటం ఘోర పాపం కూడా కాదు! గతంలో ఎన్నో సార్లు మొత్తానికి మక్కా మస్జిదే మూసివేసి హజ్ ను సైతం ఆపేసిన  సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన వారి నుండి అంటూ వ్యాధులు ప్రబలి వివిధ వైరస్ ల కారణంగా వేలల్లో ప్రాణ నష్టం జరగటం అన్నది గమనార్హం.
 
ఇప్పుడు కరోనా మహమ్మారి (Pandemic) గా మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు సమూహంగా ఏర్పడటం ఒక్కటే కరోనా వేగంగా వ్యాప్తి చెందటానికి  మూల కారణంగా మారుతున్న సందర్భంలో మరి మసీదులకు పోయి సామూహిక నమాజ్ చదవకపోతే ఎలా? శుక్రవారం నమాజ్ తప్పనిసరికదా? అన్నది చాలా మందికి అదేదో బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది!