45 ఏళ్ల ఎమర్జెన్సీ వంకతో కాంగ్రెస్ పై అమిత్ షా ట్వీట్ల దాడి..

సరిగ్గా 45 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో దేశంలో రాత్రికి రాత్రి ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తన ట్వీట్లతో కాంగ్రెస్ తో చెడుగుడు ఆడుకున్నారు. అప్పటి ఇందిరాగాంధీ నేతృత్వం లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వ తీరుపై ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. 45 ఏళ్ల క్రితం ఇదే రోజున అధికార దాహంతో ఉన్న ఓ కుటుంబం దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించింద‌ని అయన మండిప‌డ్డారు. రాత్రికి రాత్రే దేశాన్ని ఒక జైలులా మార్చివేశార‌ని ఆయన విమ‌ర్శించారు. మీడియాను, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను, భావ‌స్వేచ్ఛ‌ను సర్వ నాశ‌నం చేశార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పేద‌, బడుగు వ‌ర్గాల వారిపై దారుణ అకృత్యాలు జ‌రిగాయ‌ని అమిత్ షా ఆరోపించారు.

తరువాత ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల పోరాటం వ‌ల్ల ఎమ‌ర్జెన్సీని ఎత్తివేశార‌ని అమిత్ షా తన ట్వీట్ల ద్వారా తెలిపారు. దేశంలో ప్ర‌జాస్వామ్యం తిరిగి నిలబడింది కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అది లేదన్నారు. కేవలం ఒక కుటుంబ ప్ర‌యోజ‌నాల కోసం జాతి ప్ర‌యోజ‌నాలు, పార్టీ ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న పెట్టి పరిపాలన చేసారని అయన విమ‌ర్శించారు. దీంతో ఇప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీ అలాగే ఉండిపోయింద‌ని అమిత్ షా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మైండ్‌సెట్‌లో ఇప్పటికి ఎమ‌ర్జెన్సీ ఆలోచ‌న‌లే ఉన్నాయ‌ని అమిత్ షా విమ‌ర్శించారు.