జగన్ కు ఢిల్లీ పెద్దల క్లాస్! 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఏపీలో కాక రేపుతోంది. వైసీపీ చెబుతున్నట్లు ఏపీకి కేంద్ర సాయం అడగడానికి జగన్ వెళ్లలేదని సమాచారం. కేంద్ర పెద్దలను కలవడానికి జగన్ అపాయింట్ మెంట్ అడగలేదని.. కేంద్ర పెద్దలే జగన్ ను ఢిల్లీకి పిలిపించారని సమాచారం. అందుకే  జగన్ హడావుడిగా హస్తిన వెళ్లారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై కేంద్ర పెద్దలు అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి  గుర్రుగా ఉన్నారని, దానిపై మాట్లాడేందుకే జగన్ ను పిలిపించినట్లు చెబుతున్నారు. తనను కలిసిన జగన్ కు అమిత్ షా క్లాస్ పీకినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పాయని, మీరేం చేస్తున్నారని జగన్ ను అమిత్ షా ప్రశ్నించినట్లు సమాచారం. 

 

ఏపీ సీఎం జగన్ తో ఢిల్లీకి వెళ్లిన వారిలో ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరాం,  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ కుమారుడు భూషన్, ఏపీ సీనియర్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఉన్నారు. లీగల్ శాఖకు చెందిన వారే జగన్ వెంట ఉన్నారు కాబట్టి... న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలపైనే జగన్ తో కేంద్ర పెద్దలు మాట్లాడుతున్నట్లు నిర్దారణ అవుతోంది. కొన్ని రోజులుగా ఏపీలో న్యాయ వ్యవస్థపై వైసీపీ మూకుమ్మడి దాడి చేస్తున్నట్లు కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. హైకోర్టు జడ్జీలతో పాటు సుప్రీంకోర్టు జడ్జీలపైనా కొందరు వైసీపీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. వివిధ రూపాల్లో జడ్జీలపై ఆరోపణలు, ప్రకటనలు చేశారు. జడ్జీలను వివాదాల్లోకి లాగే ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. జగన్  కేబినెట్ లోని కొందరు మంత్రులు కూడా కులం పేరుతో న్యాయమూర్తులను కించపరిచేలా కామెంట్లు చేశారు. పార్లమెంట్ లోనూ న్యాయ వ్యవస్థపై విమర్శలు చేశారు వైసీపీ ఎంపీలు. లోక్ సభలో మిథున్ రెడ్డి, రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఏపీ హైకోర్టు జడ్జీలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న కేంద్రం ఆగమేఘాల మీద జగన్ ను పిలిపించినట్లు తెలుస్తోంది. 

 

లీగల్ అంశానికే సంబంధించి మరో ప్రచారం కూడా జరుగుతోంది. అవినీతి కేసుల సత్వర విచారణకు జగన్ భయపడుతున్నారని, ఆ కేసులపైనే కేంద్రంతో మాట్లాడేందుకే ఢిల్లీ వెళ్లారని కూడా చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులకు సంబంధించిన పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు ఇటీవలే సీరియస్ గా స్పందించింది. క్రిమినల్ కేసులున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవిత కాల నిషేదం విధించాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వస్తోంది. దీంతో సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే లోపే.. తమపై ఉన్న కేసులను కొలిక్కి తెచ్చుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారని అందులో భాగంగానే బీజేపీని మరింత మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 
           

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఆలయాలపై దాడులు పెరిగాయి. అంతర్వేది శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ రథోత్సవం తగలబడటం కలకలం రేపింది. బెజవాడ దుర్గ గుడిలో వెండి సింహాలు మాయమయ్యాయి. రోజుకో చోట ఆలయంపై దాడి జరుగుతూనే ఉంది. ఆలయాలపై దాడులను బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఏపీ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడులపైనా జగన్ ను బీజేపీ పెద్దలు ప్రశ్నించినట్లు సమాచారం.