అమెరికాలో వాళ్లకు నో మాస్క్.. 

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. మూడు నెలల క్రితం వైరస్ విజృంభణలో అల్లాడిపోయిన అమెరికా.. తొందరగానే కోలుకుంది. కరోనాను సమర్ధవంతంగా కట్టడి చేయగలిగింది. ప్రస్తుతం అమెరికా 30 వేల వరకు మాత్రమే రోజువారి కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా వందల్లోకి వచ్చేసింది. వ్యాక్సినేషన్ ను వేగంగా నిర్వహించడం వల్లే కొవిడ్ ను కంట్రోల్ చేశామని అమెరికా అధికారులు చెబుతున్నారు. 

కొవిడ్ తీవ్రత తగ్గడంతో అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) కొత్త మార్గదర్శకాలు ప్ర‌క‌టించింది. అమెరికాలో రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారు ఇక‌పై ముఖానికి మాస్కులు ధ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది. అలాగే  రెండు మోతాదుల టీకా తీసుకున్నవారు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ కార్యకలాపాలను స్వేచ్ఛగా కొనసాగించుకోవచ్చని సీడీసీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

 సీడీసీ నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల ప్రకారం  టీకా రెండో డోసు తీసుకున్న రెండు వారాల తర్వాత అమెరికన్లు మాస్కులు తీసేయవచ్చు. వ్యాక్సిన్​ తీసుకోకపోయినా, పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ పొందక పోయినా మాస్కు వేసుకోవాల్సిందే. ప్రయాణాలకు ముందు, ఆ తర్వాత కొవిడ్​ పరీక్షలు చేయించుకోనవసరం లేదు. ప్రయాణం తర్వాత క్వారంటైన్​, హోంక్వారంటైన్​ అవ్వాల్సిన అవసరం లేదు.మోడెర్నా, ఫైజర్​, ఆస్ట్రాజెనెకా, జాన్సన్​ అండ్​ జాన్స్ వ్యాక్సిన్ తీసుకున్న వారికే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని సీడీసీ వెల్లడించింది. సీడీసీ ప్రకటనపై ప్రెసిడెంట్‌ జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు.  శ్వేతసౌధంలోని రోజ్ గార్డెన్‌లో ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హ్యారిస్‌తో క‌లిసి బైడెన్ మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా స‌మావేశానికి బైడెన్‌తో పాటు క‌మ‌ల కూడా ముఖానికి మాస్క్ లేకుండా వ‌చ్చారు.

"ఇదొక గొప్ప రోజు. అమెరికన్లకు టీకాల‌ను శరవేగంగా అందించ‌డం వల్లే ఈ మైలురాయిని అందుకున్నామ‌ని"  బైడెన్ ఆనందం వ్య‌క్తం చేశారు. సీడీసీ చెప్పిన‌ట్లు రెండు డోసుల‌ టీకా తీసుకున్న ప్రజలు ఇక‌పై మాస్కులు ధ‌రించాల్సిన అవసరం లేదని అన్నారు. దేశంలోని 50 రాష్ట్రాల‌కు గాను 49 రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయ‌ని తెలిపారు. అలాగే గతేడాది ఏప్రిల్​ నాటితో పోలిస్తే మరణాలు 80శాతం తగ్గాయ‌ని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా గత 40ఏళ్లలో ఎన్న‌డూ లేని విధంగా పుంజుకుంటోందని గుర్తు చేశారు. దీంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగైన‌ట్లు చెప్పుకొచ్చారు. కేవ‌లం 114 రోజుల్లో 25 కోట్ల మందికి టీకాలు అందించ‌డం గొప్ప విష‌యంగా బైడెన్ చెప్పారు.