కొవిడ్ చికిత్స కోసం హైదరాబాద్ వస్తున్నారా! అయితే ఇవి తెలుసుకోండి ..

ఆంధ్ర ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి కొవిడ్ చికిత్స కోసం హైదరాబాద్ వచ్చే వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. కొవిడ్ బాధితులకు రాష్ట్ర సరిహద్దుల్లో  ఎదురవుతున్న సమస్యలు, అదే విధంగా, హైదరాబాద్ ఆసుపత్రులలో బెడ్స్ దొరక్క, అంబులెన్సులలోనే  ఒక అసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి పరుగులు తీస్తూ పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని సీఎస్ సోమేశ్ కుమార్  ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేశారు.ఇతర రాష్ట్రాల నుండి అంబులెన్సుల్లో వచ్చి ఏ హాస్పిటల్‌లోనూ బెడ్ దొరక్క అంబులెన్స్‌లోనే పేషెంట్‌ను పెట్టుకుని తిరుగుతున్నట్లుగా .. దీంతో వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. వాళ్లు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ విధానాన్ని ఖరారు చేసిందని ప్రకటించింది. 

,తెలంగాణ ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ముందుగానే, హైదరాబాద్ ఆసుపత్రులని సంప్రదించి, బెడ్స్ బుక్ చేసుకునేందుకు, ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్’లో చికిత్స పొందేందుకు వచ్చే వారు కాల్ సెంటర్ నెంబర్లకు కాల్ చేస్తే, ఏ హాస్పిటల్‌లో బెడ్, అడ్మిషన్స్ ఖాళీగా ఉన్నాయో వారు సమాచారం తెలుపుతారు. దీంతో సరిహద్దు వద్ద బాధితులు ఇబ్బందులు పడకుండా హాస్పిటల్ వివరాలు తీసుకోవచ్చు. హాస్పిటల్ నుండి అడ్మిషన్ లెటర్ ఉంటే కోవిడ్ పేషెంట్లను తీసుకొచ్చేందుకు కంట్రోల్ రూమ్ అనుమతులు ఇవ్వనున్నదని ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్ కంట్రోల్ రూమ్ పాస్‌తో పాటు ఈ-పాస్ తప్పనిసరిని అధికారులు తెలిపారు. 

హైదరాబాద్‌లో చికిత్స కోసం వచ్చే రోగులకు ఇక్కడి ఆసుపత్రులలో ముందస్తు అడ్మిషన్ అనుమతి వివరాలను కంట్రోల్ రూము (040 2465119, 9494438251)కు కానీ, లేదంటే idsp@telangana.gov.in వెబ్‌సైట్‌కు కానీ ఆయా ఆసుపత్రులు తెలియజేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రోగి పేరు, వయసు, రాష్ట్రం, అటెండెంట్ పేరు, మొబైల్ నంబరు, టైఫ్ ఆఫ్ బెడ్ వంటి వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. రోగుల వాహనాలు రాష్ట్రంలోకి వచ్చేటప్పుడు ఈ వివరాలను చెబితే అనుమతిస్తారు. ఇందుకోసం సరిహద్దుల వద్ద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.