అగ్రరాజ్యం మధ్యంతర ఎన్నికల వ్యయం: కొత్త రికార్డు.. లక్ష కోట్లు దాటేసింది.!
Published on: Sat Nov 14, 2026 2:49PM

అమెరికా రాజకీయ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా మధ్యంతర ఎన్నికల వ్యయం కొత్త శిఖరాలను అధిరోహించింది. పాత రికార్డులను బద్దలు కొట్టింది. 2026 అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్ ముగిసేసరికి మొత్తం ఖర్చు 11.9 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రమారమి 1.05 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది స్వతంత్ర పరిశోధనా సంస్థ ఓపెన్ సీక్రెట్స్ అంచనా. అమెరికా ఎన్నికల చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన మధ్యంతర ఎన్నికలుగా నిలిచాయి. గత 2022 ఎన్నికలతో పోలిస్తే ఇది దాదాపు 30 శాతం ఎక్కువ. కాంగ్రెస్‌లో ఎవరు పీఠం ఎక్కాలనేది నిర్ణయించడానికి ప్రవాహంలా వచ్చిపడిన ఈ నిధులు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చకు దారితీశాయి.
గత దశాబ్ద కాలంలో అమెరికా ఫెడరల్ ఎన్నికలపై మొత్తం 60 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు కాగా, ఒక్క 2024 అధ్యక్ష ఎన్నికల్లోనే 14.8 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. అయితే తాజాగా జరిగిన మధ్యంతర ఎన్నికల ఖర్చు గతంలో కాంగ్రెస్ ఎన్నికలకు వెచ్చించిన మొత్తాన్ని కూడా దాటిపోవడం గమనార్హం. ఈ భారీ నిధుల ప్రవాహం వెనుక అగ్రశ్రేణి దాతల పాత్ర అత్యంత కీలకంగా మారింది. అక్టోబర్ మధ్య నాటికి కేవలం టాప్ 40 మంది దాతలు మాత్రమే ఏకంగా 2.4 బిలియన్ డాలర్లను అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 21 వేల కోట్ల రూపాయలు రాజకీయ విరాళాల రూపంలో అందజేశారు. దశాబ్దం కిందట ఈ జాబితాలో చోటు దక్కించుకోవడానికి కేవలం 2.3 మిలియన్ డాలర్లు సరిపోయేవి, అయితే.. ఇప్పుడు ఆ అర్హత సాధించాలంటే కనీసం పాతిక మిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ భారీ విరాళాల జాబితాలో ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఒక్కరే 445 మిలియన్ డాలర్లకు పైగా సమకూర్చడం ఆధునిక అమెరికా చరిత్రలోనే ఒక వ్యక్తి ఇచ్చిన అతిపెద్ద రాజకీయ విరాళంగా రికార్డు సృష్టించింది.
ఇందులో ప్రత్యక్ష చట్టబద్ధమైన విరాళాల కంటే సూపర్ ప్యాక్ ల ద్వారానే అధిక మొత్తంలో ఖర్చు చేసినట్లు తేలింది. మరోవైపు, దాతల పేర్లు బయటకు పొక్కని డార్క్ మనీ రూపంలో 1.47 బిలియన్ డాలర్లు ప్రవహించగా, అగ్రశ్రేణి దాతల జాబితాలోనే దాదాపు 699 మిలియన్ డాలర్ల మూలాలు ఎవరివో గుర్తించలేని విధంగా ఉన్నాయి. క్రిప్టో కరెన్సీ, కృత్రిమ మేధ, రంగాలు సైతం వందల మిలియన్ డాలర్లను ఖర్చు చేసి తమకు అనుకూలమైన విధానాల రూపకల్పనకు ప్రయత్నించినట్లు సమాచారం. ఎన్నికల నిధుల పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యత కలిగిన ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.

కమిషనర్లు లేకపోవడం వల్ల తగిన కోరం కొరత ఏర్పడి, సంస్థ తన అధికారాలను పూర్తిస్థాయిలో నిర్వర్తించలేకపోతోంది. దీనివల్ల ఎటువంటి జరిమానాలు విధించే పరిస్థితి లేకపోగా, పెండింగ్‌లో ఉన్న కేసులు రెట్టింపు అయ్యాయి. చట్టపరమైన నిబంధనలు ఉన్నప్పటికీ, ఆచరణలో పర్యవేక్షించే యంత్రాంగం నిర్వీర్యం కావడంతో అపారమైన ధనబలం నిరాయుధంగా ఎన్నికలను ప్రభావితం చేయడానికి మార్గం సుగమమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా ఈ నిధుల ప్రవాహం రెండు ప్రధాన పార్టీలకూ వర్తిస్తున్నప్పటికీ, దాతల మద్దతులో స్పష్టమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. సంప్రదాయవాద సంస్థలు డెమొక్రాట్ల కంటే రిపబ్లికన్ పార్టీ వైపు పెద్దఎత్తున నిధులను మళ్లించాయి.
ఇది కూడా చదవండి: ఎలాన్ మస్క్: పారిశ్రామిక వేత్తే కాదు అంతకు మించి.!
ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షించే ఈ ప్రయత్నాలు ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలను ఎంతవరకు ప్రతిబింబిస్తున్నాయనే దానిపై పౌర సమాజంలో తీవ్రమైన మధన సాగుతోంది. మెజారిటీ ప్రజలు రాజకీయాల్లో ధన ప్రభావం పెరిగిపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, చట్టపరమైన మార్పులు రాకపోవడం గమనార్హం. రాబోయే కాలంలో ఈ భారీ ఆర్థిక వ్యయం ప్రజాస్వామ్య వ్యవస్థలపై మరియు శాసనసభల విధానాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

పరిశ్రమలు, కార్పొరేట్ దిగ్గజాలు సమకూర్చే విరాళాలు భవిష్యత్ చట్టాల రూపకల్పనను తమ వైపునకు తిప్పుకునే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల ఖర్చులను నియంత్రించడం, డార్క్ మనీని అడ్డుకోవడం, పారదర్శకతను పెంచడం వంటి సంస్కరణలు రాకపోతే, రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య విలువలు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మీకు నచ్చవచ్చు: ఇండియా, స్టార్‌లింక్ వివాదం: ఎలాన్ మస్క్ ఆరోపణలు.. వాస్తవాలు, భద్రతా సవాళ్లు.!
తంపుల మారి ఎలాన్ మస్క్: ప్రధాని అంబానీ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు.!
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
[America, Midtermelections,Electionspending, ElonMusk Donations, FEC, TeluguOne]


