తంపుల మారి ఎలాన్ మస్క్: ప్రధాని అంబానీ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు.!
Published on: Mon Oct 12, 2026 4:05PM

టెక్నాలజీ రంగంలో వినూత్న ప్రయోగాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎలాన్ మస్క్..తన వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం జగడాలతో చెలరేగిపోతారనీ, ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తూ, ఆధిపత్యం సాధించి సక్సెస్ కావడమే ధ్యేయంగా ముందుకు సాగుతారన్న విమర్శలు ఇప్పుడు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఎలాన్ మస్క్ అంటే వ్యాపార విజయాలు మాత్రమే కాదు జగడాలూ తెరమీదకు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్, ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్, సామాజిక మాధ్యమం ఎక్స్.. ఇలా విభిన్న రంగాల్లో ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. అయితే ఆయా రంగాల్లో వ్యాపార ప్రయోజనాలు, ప్రభుత్వ నియంత్రణలు, భద్రతా నిబంధనలు, మార్కెట్ పోటీ తదితర అంశాల విషయంలో ఎలాన్ మస్క్ వ్యవహరిస్తున్న తీరు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తాజాగా భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభానికి సంబంధించిన అనుమతుల వ్యవహారంపై మస్క్ చేసిన వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇండియాలో తన స్టార్ లింక్ ఎంట్రీకి కొందరు శక్తిమంతమైన ఇండియన్ వ్యాపారవేత్తలు అడ్డుపడుతున్నారంటూ ఎలాన్ మస్క్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఆరోపించారు. ఆయన ఆరోపణలను కేంద్రం ఖండించింది. అది వేరే విషయం. కానీ ఒక సార్వభౌమ దేశం, ఆ దేశంలోని ప్రభుత్వం పూర్తిగా కొందరు వ్యాపారుల నియంత్రణలో ఉందనీ, అక్కడ ప్రభుత్వం కూడా వారి చెప్పు చేతల్లోనే నిలుస్తోందంటూ, ఇండియా, చైనాల ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు దారి తీశాయి.
స్టార్‌లింక్ సేవలు మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించగలవని ట్రంప్ చెబుతున్నప్పటికీ, ఉపగ్రహాల ద్వారా అందించే ఇంటర్నెట్ సేవలకు స్పెక్ట్రమ్ కేటాయింపు, భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ అనుమతుల తదితర కీలక అంశాలలో భారత ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. భద్రతా ప్రమాణాల విషయంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎలాన్ మస్క్ తన వ్యాపార విస్తరణకు అడ్డంకిగా భావిస్తూ.. ముఖేష్ అంబానీ డిఫాక్టో సీఎంగా వ్యవహరిస్తూ తన స్టార్ లింక్ ను అడ్డుకుంటున్నారంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ ద్వారా ఆరోపణలు గుప్పించారు.

అసలు మస్క్ వ్యాపార సామ్రాజ్య విస్తరణలో ఇలాంటి జగడాలు, వివాదాలు సింహభాగం ఆక్రమిస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మస్క్ కొనుగోలు చేసిన ఎక్స్ సామాజిక మాధ్యమ వేదిక కూడా పలు దేశాల్లో నియంత్రణ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోంది. కంటెంట్ నియంత్రణ, వినియోగదారుల సమాచార రక్షణ, వేదిక అల్గారిథమ్‌ల పారదర్శకత వంటి అంశాలపై పలు దేశాల ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫ్రాన్స్‌లో ఎక్స్ కార్యకలాపాలకు సంబంధించిన ఆరోపణలపై న్యాయ విచారణ ప్రక్రియ ఆరంభమైంది. మస్క్ మాత్రం రాజకీయ ప్రేరణ అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తంగా చూస్తే, మస్క్ చుట్టూ తలెత్తుతున్న వివాదాలు వ్యక్తిగత విభేదాలకే పరిమితం కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సాంకేతిక సంస్థల శక్తి, ప్రభుత్వాల నియంత్రణాధికారం, మార్కెట్ పోటీ, జాతీయ భద్రత వంటి విస్తృత అంశాలను ఇవి ముందుకు తెస్తున్నాయి. భారత్‌లో స్టార్‌లింక్ అనుమతుల వ్యవహారంలో మస్క్ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
[Elon Musk Controversies, Elon Musk Conflicts, Starlink India, Musk Ambani Dispute, X Social Media, international Technology, National Security, Telugu One]


