TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇండియా, స్టార్‌లింక్ వివాదం: ఎలాన్ మస్క్ ఆరోపణలు.. వాస్తవాలు, భద్రతా సవాళ్లు.!

Published on: Fri Oct 9, 2026 3:43PM

 భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించే ప్రయత్నంలో ఉన్న ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థకు, ప్రభుత్వ నియంత్రణ సంస్థలకు మధ్య నెలకొన్న వివాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారత మార్కెట్లో తమ ప్రవేశాన్ని కొందరు   కుబేరులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని, ఇది ప్రజలపై జరుగుతున్న నేరమని ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా  ఆరోపణలు గుప్పించారు. భారతదేశ  అసలు యజమాని అంబానీయేనా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఈ ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు, ప్రభుత్వ నియంత్రణలు,  జాతీయ భద్రతా కోణాలను పరిశీలిస్తే పూర్తి భిన్నమైన చిత్రం కనిపిస్తుంది.

కాగితంపై పరిశీలిస్తే, స్టార్‌లింక్ సంస్థ భారత్‌లో అవసరమైన పలు కీలక అనుమతులను ఇప్పటికే సాధించింది. టెలికాం శాఖ నుంచి జీఎంపీసీఎస్ లైసెన్స్‌ను జూన్ 2025లో పొందగా, అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్-స్పేస్ ) ఆమోదం జూలై 2025లో లభించింది. అలాగే వందల యాంటెన్నాలతో గేట్‌వే సైట్ల ఏర్పాటుకు సిద్ధమవ్వడంతో పాటు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లతో ఒప్పందాలూ కుదుర్చుకుంది. అయినప్పటికీ హోమ్ మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న తుది భద్రతా క్లియరెన్స్, ఎఫ్‌డీఐ ఆమోదం,  కేబినెట్ ఆమోదం పొందాల్సిన స్పెక్ట్రం ధర నిర్ణయ ఫ్రేమ్‌వర్క్ ఇంకా పూర్తికావాల్సి ఉంది. ఈ ఫ్రేమ్‌వర్క్ పూర్తి పారదర్శకతతో, ఎలాంటి వివక్ష లేకుండా అన్ని శాట్‌కామ్ లైసెన్సీలకు ఒకేలా వర్తిస్తుందని కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

మస్క్ ఆరోపిస్తున్నట్లుగా దేశంలోని కుబేరుల ప్రమేయం ఉంటే, ముఖేష్ అంబానీకి చెందిన స్వంత ఉపగ్రహ సంస్థకు కూడా ఇంకా పూర్తి అనుమతులు లభించకపోవడానికి కారణం ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. భారత్ టెలికాం మార్కెట్‌లో జియో, ఎయిర్‌టెల్ సంస్థలు అధికభాగం నియంత్రిస్తున్నప్పటికీ, భద్రతాపరమైన తనిఖీలు అన్ని కంపెనీలకు ఒకే విధంగా వర్తిస్తున్నాయి. నియంత్రణ సంస్థలు పద్ధతి ప్రకారం వ్యవహరించడాన్ని గుత్తాధిపత్య స్వాధీనంగా భావించడం సరికాదని పరిశీలకులు అంటున్నారు. 

ఇండియా అనుసరిస్తున్న ఈ జాగ్రత్త ధోరణి వెనుక బలమైన చారిత్రక కారణాలున్నాయి. 26/11 ముంబై దాడుల సమయంలో ఉగ్రవాదులు విదేశీ శాటిలైట్ ఫోన్లను ఉపయోగించి స్థానిక నెట్‌వర్క్‌లను దాటవేసి సమాచార మార్పిడి చేయడం దేశ భద్రతా వ్యవస్థకు  సవాలుగా మారింది. సరిహద్దు ప్రాంతాలు, అడవులు, సముద్రాల్లో ఎలాంటి సిమ్ లేదా కేవైసీ లేకుండా పనిచేసే శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ టెక్నాలజీ భద్రతాపరమైన ఆందోళనలను మరింత పెంచుతోంది. ఇంటర్నెట్ షట్‌డౌన్‌లను సైతం ప్రతిఘటించే ఈ వ్యవస్థపై డేటా స్థానికీకరణ, చట్టబద్ధమైన అడ్డగింపు, సరిహద్దుల వద్ద జియో-ఫెన్సింగ్ వంటి నిబంధనలను ప్రభుత్వం విధించింది.

ఈ ఆందోళనలు కేవలం ఊహాజనితమైనవి కావు అనడానికి గడచిన పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. డిసెంబర్ 2024లో మణిపూర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థకు చెందిన గుప్తస్థావరం నుంచి స్టార్‌లింక్ డిష్,  రౌటర్‌ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రభుత్వ ఇంటర్నెట్ నిషేధాలను అధిగమించడానికి ఈ సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ టెర్మినల్స్ వాడుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే భారత్‌పై స్టార్‌లింక్ సిగ్నల్స్ ఆన్ చేయలేదని స్పేస్‌ఎక్స్ స్పష్టం చేసినప్పటికీ, ఇటువంటి సాంకేతికతలు దేశీయ భద్రతా వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నాయనే వాదనలో బలం ఉంది. 

మరోవైపు, అంతర్జాతీయ వాణిజ్య విధానాలను పరిశీలిస్తే ఇదే రకమైన రక్షణ ధోరణులు అమెరికాలోనూ కనిపిస్తున్నాయి. చైనా నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రిక్ వాహనాలపై  అమెరికా ప్రభుత్వం దాదాపు 147.5 శాతం మేర భారీ పన్నులను విధించింది. జాతీయ భద్రత,  పారిశ్రామిక స్థావరాన్ని రక్షించుకోవడమే దీనికి ప్రధాన కారణమని వైట్ హౌస్ చెబుతోంది. ఈ చర్యల ద్వారా టెస్లా సంస్థకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతున్నప్పటికీ, అమెరికా తన మార్కెట్‌ను రక్షించుకోవడానికి ఈ గోడలను నిర్మించింది. జాతీయ భద్రత పేరిట అమెరికా తన మార్కెట్‌ను కాపాడుకున్నప్పుడు, శాటిలైట్ కమ్యూనికేషన్ల విషయంలో భారత్ నిబంధనలు పెట్టడం తప్పుకాదని నిపుణులు అంటున్నారు.

అలాగే హెచ్ 1బీ వీసాల విషయంలోనూ అమెరికా అవలంబించిన విధానాలు భారత ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. కొత్త హెచ్ 1బీ పిటిషన్లపై భారీ రుసుములను ప్రవేశపెట్టడంతో భారత ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల దరఖాస్తులు భారీగా పడిపోయాయి. ఆచరణలో ఇది ఒక రకమైన పన్ను భారంగా మారినప్పటికీ, స్థానిక ఉద్యోగావకాశాలు మరియు నైపుణ్యాల కొరతను సాకుగా చూపి అమెరికా ఈ నిర్ణయాలను సమర్థించుకుంటోంది. దేశాల సార్వభౌమాధికారం మరియు రక్షణ విషయంలో ప్రతి దేశానికి తమ సొంత విధానాలు ఉండే అవకాశం ఉందని ఇది తెలియజేస్తుంది.

ఈ మొత్తం వివాదాన్ని పరిశీలిస్తే, ఎలాన్ మస్క్ తన వ్యాఖ్యల్లో ఎంపిక చేసుకున్న అంశాలపైనే ఎక్కువగా స్పందిస్తున్నారని స్పష్టమవుతోంది. అమెరికాలో అమలవుతున్న పన్నులు,  వీసా నిబంధనలపై ఆయన మౌనం వహిస్తూ, భారత్ అనుసరిస్తున్న నిబంధనలను తప్పుపట్టడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విదేశీ సాంకేతికత ఏ షరతులపై దేశంలోకి ప్రవేశించాలనేది పూర్తిగా సార్వభౌమ దేశాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. పౌరుల డేటా రక్షణ,  భద్రతా సవాళ్లను ఎదుర్కొనే హక్కు భారత్‌కు పూర్తిగా ఉంది.

అదే సమయంలో.. ఇండియా   తన నియంత్రణ విధానాల్లో మరింత పారదర్శకతను పాటించాల్సిన అవసరం ఉంది. భద్రత ముసుగులో  ఎక్కవ కాలం పాటు అనుమతులను నిలిపివేయడం సరికాదని, నిబంధనలు పాటించిన సంస్థలకు సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. జియో వంటి దేశీయ సంస్థలకు సమాన అవకాశాలు కల్పించడంతో పాటు, అర్హత కలిగిన విదేశీ సంస్థలకు మార్గం సుగమం చేయడం ద్వారా మాత్రమే ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఏర్పడుతుంది. భవిష్యత్తులో డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రభుత్వం సమతుల్యమైన విధానాలను రూపొందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   

[Satellite broadband Security Regulations, US H1B Visa Fees, Guidelines   Indian Department  Telecommunications, Elan Musk, Allegations, Telugu One]