అంబటి అతి తెలివి.. పోలవరంపై అవాకులు, చెవాకులు!

సినిమాల్లో క‌మెడియ‌న్లు చేసే కామెడీ సీన్లు చూస్తే క‌డుపుబ్బా న‌వ్వొస్తుంది.  ఇంటిల్లిపాదీ కూర్చొని హాయిగా న‌వ్వుకుంటుంటాం.  అయితే, 2019లో వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సినిమాల్లో క‌మెడియ‌న్ల‌కు గిరాకీ బాగా తగ్గిపోయింది. ఎందుకంటే, గ‌త ఐదేళ్లలో జగన్, ఆయన మంత్రులు చేసిన కామెడీని ప్ర‌జ‌లు తెగ ఎంజాయ్ చేశారు. ప్ర‌జ‌లకు మెరుగైన పాల‌న అందించండ‌ని అధికారం అప్ప‌గిస్తే, జగన్ కేబినెట్ లోని  మంత్రులు డ్యాన్సులు చేస్తూ, సామెత‌లు చెబుతూ, పాట‌లు పాడుతూ ప్ర‌జ‌ల‌ను ఎంట‌ర్‌టైన్ చేశారు. సోష‌ల్ మీడియా ఓపెన్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికి జ‌గ‌న్ క్యాబినెట్‌లోని మంత్రుల డ్యాన్సులే ద‌ర్శ‌న‌మివ్వ‌డం గ‌త ఐదేళ్ల కాలంలో స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది.  దీంతో 2024 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు వైసీపీని ఓటు ద్వారా దాదాపు తుడిచి పెట్టేశారు. ప్ర‌జ‌లు గ‌ట్టిగుణ‌పాఠం చెప్పినా వైసీపీ నేత‌ల బుద్ది మార‌డం లేదు. ఇంకా కామెడీలు చేస్తూ ప్ర‌జ‌ల్లో మ‌రింత చుల‌క‌న‌వుతున్నారు. ఒక‌రు ఈవీఎంల వ‌ల్ల‌నే మేం ఓడిపోయామ‌ని చెబుతుంటే.. మ‌రొక‌రు పోల‌వ‌రం ప్రాజెక్టును చంద్ర‌బాబే నాశ‌నం చేశారంటూ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. వీరి అతితెలివిని చూసిన ఏపీ ప్ర‌జ‌లు.. వీళ్ల‌కు 11 సీట్లు ఇచ్చి త‌ప్పుచేశామంటూ తలలు బాదుకునే పరిస్థితికి వచ్చారు. 

 వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో అంబ‌టి రాంబాబు ఒక‌రు. ఆయన తెలివితేట‌ల‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏకంగా నీటిపారుద‌ల శాఖనే క‌ట్ట‌బెట్టారు. కోతికి కొబ్బ‌రిచిప్పలా   అంబ‌టికి నీటిపారుదల శాఖ దొరికింది.  జ‌గ‌న్ క్యాబినెట్ లోనే అంత‌కు ముందు ఈ శాఖ‌ను అనిల్ కుమార్‌ యాద‌వ్ చూశారు. పోల‌వ‌రం ప్రాజెక్టును 2021 డిసెంబ‌ర్ నాటిక‌ల్లా పూర్తిచేస్తామ‌ని అసెంబ్లీలో స‌వాల్ చేశారు. సీఎం హోదాలో జ‌గ‌న్  సైతం 2021 చివ‌రి నాటికి పోల‌వ‌రం పూర్తి చేస్తామ‌న్నారు. ఆ త‌రువాత ఏడాదికేడాది పోల‌వ‌రం పూర్తిచేస్తామ‌న్న తేదీలు మారుతూ వ‌చ్చాయి. ఇక.. అనిల్ కుమార్ యాదవ్ తరువాత నీటిపారుద‌ల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంబ‌టి రాంబాబు కోత‌లు  కోట‌లు దాటిపోయాయి.. చివ‌రికి పోల‌వ‌రం ప్రాజెక్టులో ఇసుమంతైనా ప‌నులు జ‌ర‌గ‌లేదు సరికదా.. జ‌రిగిన నిర్మాణాలకు సైతం ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేక పోయారు. మొత్తంగా చెప్పాలంటే వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల కాలంలో పోల‌వరం ప్రాజెక్టును పూర్తిగా విస్మ‌రించింది. ప్ర‌స్తుతం  తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డం, సీఎంగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు చేప‌ట్టిన వారం రోజుల్లోనే పోల‌వ‌రం బాట ప‌ట్టారు. గ‌తంలోలా   సోమ‌వారాన్ని పోల‌వారంగా మార్చేశారు. ఇందులో భాగంగా గ‌త సోమ‌వారం పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించిన చంద్ర‌బాబు.. వైసీపీ హ‌యాంలో ప్రాజెక్టుకు జ‌రిగిన న‌ష్టాన్నిచూసి తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యారు. 

గ‌తంలోతెలుగుదేశం హ‌యాంలో పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు 72శాతం పూర్త‌య్యాయి. వైసీపీ హ‌యాంలో ప‌నులు కొన‌సాగించ‌డం మానేసి.. నిధుల‌ను సైతం ప‌క్క‌దారి ప‌ట్టించారు. సోమ‌వారం పోల‌వ‌రం సంద‌ర్శ‌న‌కు వెళ్లిన సీఎం చంద్ర‌బాబు నాయుడు.. వైసీపీ ఐదేళ్ల కాలంలో పోల‌వ‌రంలో ఏయే ప‌నులు చేప‌ట్టారంటూ అధికారుల‌ను ప్ర‌శ్నించారు.. వారి నుంచి ఎలాంటి స‌మాధానం రాలేదు. అస‌లు ప‌నులు నిర్వ‌హిస్తే క‌దా.. స‌మాధానం రావ‌డానికి. జ‌గ‌న్ హ‌యాంలో పోల‌వ‌రం పూర్తిగా ప‌డ‌కేసింద‌నే విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. జ‌గ‌న్ హ‌యాంలో పోల‌వ‌రం ప్రాజెక్టు  ప‌నులు ముందుకు సాగ‌లేద‌ని, తెలుగుదేశం హ‌యాంలో జ‌రిగిన నిర్మాణాల‌కు సైతం ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేద‌ని చంద్ర‌బాబు అన్నారు. చంద్రబాబు పోలవరం పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత రోజు మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టారు.  అధికారం కోల్పోయినా బుద్ధి మార‌లేద‌న్న‌ట్లుగా.. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని తాను ఎప్పుడో చెప్పాననీ,  ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చెప్పారంటూ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడేశాడు. దాని కోసం పోలవరం పోవాలా అన్నట్లుగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు చాలా టఫ్ సబ్జెక్ట్ అని అది ఎవరికీ అర్థం కాదని,  ఎందుకంటే తనకూ అర్థం కాలేదని అంబ‌టి రాంబాబు అస‌లు విష‌యం చెప్పేశాడు. 

అంబటి రాంబాబు అంటేనే.. ఓ కామెడీ పీస్ అని ఏపీ ప్ర‌జ‌లు భావిస్తుంటారు. గ‌త ఐదేళ్ల కాలంలో అంబ‌టి ప్ర‌వ‌ర్త‌న చూసి ఏపీలో న‌వ్వుకోని వ్య‌క్తి ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. డాన్సులు,  అడ్డగోలు మాటలతో ఆయన తెగ వైరల్ అయ్యారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు  తనకేమీ అర్ధంకాలేద‌ని చెప్పుకొని మ‌రోసారి ప్ర‌జ‌ల ముందు పెద్ద జోకర్ గా తనను తాను నిలబెట్టుకున్నారు. కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్‌తో ఆడుకున్నారని మాత్రం ఆయన ఇంకా గుర్తించడం లేదు. అంబ‌టి వ్యాఖ్య‌ల‌తో ఏపీ ప్ర‌జ‌ల‌కు అర్ధంకాని ప్ర‌శ్నఒక‌టి ఉంది. అదేంటంటే.. దాదాపు రెండేళ్ల‌కుపైగా నీటిపారుద‌ల శాఖ మంత్రిగా అంబ‌టి ప‌ని చేశారు.  అతిపెద్ద ప్రాజెక్టు అయిన పోల‌వ‌రం గురించి త‌న‌కు అర్థంకాలేద‌ని చెప్ప‌డంతో ఆయన తెలివి ఏపాటిదో.. అత‌నికి నీటిపారుద‌ల శాఖ అప్ప‌గించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలివి ఏపాటిదో ఇప్పుడు అర్ధ‌మ‌వుతుంద‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu