అప్పుడు టికెట్ కోసం పోటీపడ్డారు.. ఇప్పుడు పట్టించుకోరు.. ఇదీ టీడీపీ నేతల తీరు!

రాయలసీమలోని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అత్యంత వెనకబడిన ప్రాంతం అని అందరికీ తెలిసిందే. అయితే ఈ నియోజకవర్గంలో టిడిపికి మంచి పట్టుంది. అధిక ఓటు బ్యాంకు ఉన్న బీసీలు ఆది నుంచి టిడిపికి మద్దతుగా వుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. 2019 ఎన్నికల్లో ఓటమితో నాయకులు ఢీలా పడ్డారు. దీంతో కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేకపోవడమే.. ప్రస్తుత పార్టీ పరిస్థితికి కారణమని కార్యకర్తలు భావిస్తున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు టిడిపిలో నాయకత్వం కోసం నాయకులు తీవ్రంగా పోటీ పడ్డారు. మాజీ కేడీసీసీ బ్యాంకు చైర్మన్ వైకుంఠ శ్రీరాములు కుటుంబానికి అక్కడ మంచి పట్టుంది. శ్రీరాములు మరణం తర్వాత ఆయన తనయుడు మల్లికార్జునకు నియోజక వర్గం టిడిపి బాధ్యతలు అప్పజెప్పారు. 2014 ఎన్నికల్లో టిడిపి తరుపున వీరభద్రగౌడ్ బరిలో దిగి ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన వీరభద్రగౌడ్ నియోజక వర్గం ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ కోసం వైకుంఠం మల్లికార్జున, వీరభద్రగౌడ్ పోటిపడ్డారు. అసెంబ్లీ టికెట్ కోసం ఇద్దరి మధ్యా ఐదేళ్లుగా పోటీ సాగింది. ఇంతలో మూడో నాయకత్వం తెరమీదకు రావడంతో ఇద్దరి ఆశలు అడియాసలయ్యాయి. ఆలూరు అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీ హైకమాండ్ తనకే టికెట్ ఇస్తుందని వీరభద్రగౌడ్ ఆశపడ్డారు. అయితే ఆఖరి నిమిషంలో కోట్ల కుటుంబం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో వీరభద్రగౌడ్ కు నిరాశ ఎదురైంది.

ఇక్కడే ఉంది ట్విస్ట్. కోట్ల సుజాతమ్మను పార్టీ అభ్యర్థిగా హైకమాండ్ బరిలోకి దించడంతో వీరభద్రగౌడ్ పార్టీ గెలుపు కోసం పని చేయాల్సి వచ్చింది. పార్టీ ఇన్ చార్జిగా అయిదేళ్లు కష్టపడినప్పటికీ.. హైకమాండ్ గుర్తించలేదని కన్నీటి పర్యంతమైన వీరభద్రగౌడ్ నిరుత్సాహంగానే పార్టీలో కొనసాగుతున్నారు. ఆలూరుకు అనుకోని అతిథిగా వచ్చిన కోట్ల సుజాతమ్మ ఎన్నికల సమయంలో పార్టీ క్యాడర్ కు ఎంతో భరోసా నిచ్చారు. వారానికి నాలుగు రోజులు ఆలూరులోనే ఉంటానంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాత్రం సుజాతమ్మ అస్సలు నియోజక వర్గం వైపు తొంగి చూడడం లేదని టిడిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు ఆలూరుకు దూరంగా వుండటమే చర్చనీయాంశమైంది. అయిదేళ్లు పార్టీ కోసం కష్టపడ్డాను కాబట్టి టికెట్ తనకే వస్తుందని ఆశపడ్డ వీరభద్రగౌడ్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకున్న తమ కుటుంబానికి న్యాయం చేస్తారని భావించిన వైకుంఠం మల్లికార్జున చౌదరి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరో పక్క కోట్ల సుజాతమ్మ కూడా ఆలూరుకు రాకుండా పోవడంతో పార్టీ కార్యకర్తలు నిరాశగా ఉన్నారు. తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కులు చూస్తుండటం అసలైన ట్విస్ట్.