మునిసిపాలిటీల్లో గజ్వేల్ తరహా ప్లాన్.. నెలకు 70 కోట్లు!!

తెలంగాణలో గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పట్టణాలు, నగరాల డెవలప్ మెంట్ కోసం పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టనుంది. ఈ నెల 24 న మొదలయ్యే ఈ కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగనుంది. మున్సిపల్ ఎన్నికలకు ముందు నుంచి ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావించినా ఎన్నికల కారణంగా వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల పూర్తి అయ్యాయి. కొత్త పాలక మండళ్లు కొలువుదీరడంతో ఇక పట్టణాల్లో అభివృద్ధిని ప్రణాళికా బద్ధంగా చేపట్టేందుకు రెడీ అయ్యింది. కొత్త మున్సిపల్ చట్టం పరిధికి లోబడి అధికారులు ప్రజాప్రతినిధులు పట్టణాల్లో తమ బాధ్యతలు నిర్వహించాల్సి వుంటుంది.

అదేవిధంగా పట్టణ ప్రగతి కార్యక్రమం విధి విధానాల రూపకల్పన కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై ఈరోజు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు ఇతర ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. పట్టణ ప్రగతి ఉద్దేశాన్ని నేరుగా కొత్త నేతలకు సీఎం వివరించనున్నారు. కార్యక్రమం అమలుపై దిశా నిర్దేశం చేయనున్నారు. మునిసిపాలిటీల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కించేలా ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయనుంది. వార్డు స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలను భాగస్వామ్యం చేయనుంది. మున్సిపాలిటీల అభివృద్ధికి నెలకు 70 కోట్ల రూపాయలను కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమావేశానంతరం అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. గజ్వేల్ లో చేపట్టిన అభివృద్ధి పనులను మోడల్ గా చూపించనున్నారు. అన్ని మునిసిపాలిటీల్లో గజ్వేల్ తరహా ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.