ఎంఐఎం విస్తరణకు అధినేత వ్యూహం.. తమిళనాడులో పోటీకి రెడీ అంటున్న ఒవైసీ

తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర రావు, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఇంకొందరు నాయకులు, అనేక సందర్భాలలో తమకున్న జాతీయ ఆకాంక్షలను వ్యక్తపరిచారు.జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతామని ఒకరంటే, ఏకంగా ప్రదాని పీఠం మీదనే కన్నేశారు. జాతీయ స్థాయిలో బీజీపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరకంగా కూటములు కడతామని, ఫ్రంట్లు ఏర్పాటు చేస్తామని, టెంట్లు వేస్తామని చాలా చాలా ప్రకటనలు చేశారు. అయితే, ఆ ప్రయత్నాలు ఏవీ కార్యరూపం దాల్చలేదు,వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లుగా  ఒకడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి వేస్తూ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే కదలకుండా ఉండిపోయింది. ఎన్నికల సమయంలో చేసిన ప్రకటనలని ఎన్నికల హమీలతో పాటుగా నాయకులే కాదు, జనం కూడా మరిచి పోతున్నారు. అందుకే, తెలుగు చంద్రుల వెలుగులు సరిహద్దుల గడప దాటడం లేదు. అయితే, మరో వంక పాత  బస్తీ పార్టీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాత్రం  ఎలాంటి ప్రకటనలు,ప్రగల్బాలు లేకుండానే, చాలా కూల్ కూల్ ‘గా మెల్ల మెల్లగా ఒక్కొక్క రాష్ట్రలోకి తమ పార్టీ శాఖలను విస్తరించుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలోనే కాదు,దేశంలోనే  ఎన్నిక ఎన్నికకు ఎదుగుతూ, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి విస్తరిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే, అది ఎంఐఎం ఒక్కటే. ఎంఐఎం ఇప్పటికే నలుగు రాష్ట్రాల చట్ట సభలలో స్థానం సంపాదించింది. మహా రాష్ట్రలో గత సంవత్సరామ్ జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండు శాసన సభ స్థాలను గెలుచుకున్న ఎంఐఎం ఆ తర్వాత జరిగిన ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలల్లో 53 చోట్ల పోటీ చేసి, 25 కార్పొరేటర్ స్థానాలు గెలుచుకుంది.అంతే కాదు,  మొత్తం 113 స్థానాలున్నా కార్పొరేషన్’లో ఎంఐఎం మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించింది.అలాగే, ఐదారు నెలల క్రితం జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ఐదు స్థానాలు దక్కించుకుంది.అదే విధంగా ఈమధ్యనే గుజరాత్’లో జరిగిన ఆరు మున్సిపల్  కార్పొరేషన్ల  ఎన్నికల్లో మెత్తం ఏడు చోట్ల విజయ కేతనం ఎగరేసింది . అంతకు ముందే కర్ణాటక స్థానిక సంస్థలలోనూ కాలు పెట్టింది.

అలాగే, త్వరలో జరుగనున్న తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై’ అంటోంది . పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సోమవారం (మార్చి 1)హైదరాబాద్’లో మీడియాతో మాట్లాడుతూ తమిళనాడుతో పాటుగా, బెంగాల్లో కూడా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అంతే కాదు,వచ్చే సంవత్సరం జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నామని ఒవైసీ చెప్పారు. అలాగే, రాజస్థాన్’ లో పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని, అందుకోసం  పార్టీ సభ్యులతో కలిసి అక్కడకు   వెళ్తున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీని పరిచయం చేయడానికి ఇంతకన్నా మంచి సమయం లేదన్నారు. నేను ఒక్కడినే రాజకీయంగా బయల్దేరగా.. నాతో పాటు ఎందరో కుటుంబసభ్యులు కలిసి నడిచేందుకు నిర్ణయం తీసుకుంటున్నారని, వారి అండతోనే దేశమంతా ఎంఐఎంను విస్తరిస్తున్నట్లు ఒవైసీ పేర్కొన్నారు.

ఇదలా ఉంటే ఒవైసీ బీజేపీతో చేతులు కలిపి, సెక్యులర్ పార్టీలను బలహీన పరిచి, పరోక్షంగా బీజేపీ మేలు చేస్తున్నారని కాంగ్రెస్ సహా సెక్యులర్ పార్టీలు,సెక్యులర్ మీడియా ఆరోపిస్తోంది. అయితేఇటు ఒవైసీ కానీ, అటు  బీజేపీ కానీ, ఈ ఆరోపణలను అసలు పట్టించుకోవడంలేదు.అయితే,, రాజ్దీప్ సర్దేశాయ్ సహా అనేక మంది సీనియర్ జర్నలిస్టులు సైతం ఆరోపిస్తున్నవిధంగా, బీజేపీ,ఎంఐఎం మధ్య ఏదైనా డీల్ ఉందా  లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే, పాతబస్తీ పార్టీ చాప కింద నీరులా ఒక్కొక రాష్ట్రాన్ని చుట్టేస్తోంది అనేది మాత్రం నిజం.