తెలుగునేలపై అఘోరాలు.. ఆ శివాలయంలో పూజలు.. ప్రత్యేకత ఏంటి?
posted on Aug 4, 2021 2:06PM
అఘోరాలు. రుద్రం, రౌద్రంకు ప్రతిరూపాలు. సమాజంలో కలవని శివ సైనికులు. కేవలం శివ ఆరాధనే వారికి సర్వస్వం. శరీరమంతా విభూతిధారణ. ఖండించని కేశాలు. నగ్న శరీరాలతో.. చూట్టానికి భక్తికంటే భయమే ఎక్కువ కలిగించే సాధువులు. నరమాంసం తింటారనే ప్రచారం ఉన్నా అదంతా ఒట్టితేనంటారు. కాకపోతే, మామూలు శివ ఆరాధకుల కంటే వారి స్వభావం విభిన్నంగా ఉంటుంది. అలాంటి అఘోరాలు కుంభమేళాలు జరిగే చోటే దర్శనమిస్తారు. మిగతా సమయమంతా వారు ఎక్కడ ఉంటారో.. ఏమి చేస్తారో.. ఎవరికీ తెలీదు. కుంభమేళా ప్రాంతం మినహా మరెక్కడా, మరే సమయంలోనూ వారి ఉనికి కనిపించకపోవడం కాస్త ఆశ్చర్యమే. హిమాలయాల్లో ఉంటారని కొందరు, కాశీలో, ఆ సమీపంలోని దట్టమైన అరణ్యాల్లో ఉంటారని మరికొందరి అంచనా. అందుకే, అఘోరాలు అంటే అందరికీ కాస్త భయంతో కూడిన ఆసక్తి.
తాజాగా, అలాంటి అఘోరాల బృందం ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచరించడం ఆసక్తిగా మారింది. పాల్వంచలోని ఆత్మలింగేశ్వరాలయంలో స్వామి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు కూడా చేశారు. అఘోరాలు వచ్చారన్న విషయం తెలుసుకొని స్థానికులు భారీగా అక్కడికి తరలివచ్చారు. ఇలా పాల్వంచకు అఘోరాలు రావడం.. ఆత్మలింగేశ్వరాలయంలో పూజలు చేయడం.. అక్కడే సహపంక్తి భోజనం చేయడం.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ విషయం వైరల్‌గా మారింది.

పాల్వంచలోని ఆత్మలింగేశ్వరాలయం చాలా పురాతనమైనది. స్థానికంగా ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత. ఆత్మలింగేశ్వరరాలయాలు దేశంలోనే చాలా అరుదు. అందుకే, అఘోరాలు ఈ ఆలయానికి రావడం, పూజలు చేయడంపై స్థానికంగా, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
అయితే, అఘోరాలు పాల్వంచలోని ఆలయం సందర్శించడానికే ప్రత్యేకంగా రాలేదంటున్నారు. వారంతా ఇటీవల కాశీ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు కాలినడకన వచ్చారని.. మళ్లీ కాశీకి తిరిగి వెళుతుండగా.. మార్గమధ్యంలో పాల్వంచ ఆలయాన్ని సందర్శించారని చెబుతున్నారు. అఘోరాలు ఎక్కడ శివాలయం కనిపించినా అక్కడ పూజలు చేయడం సాధారణ విషయమేనని ఇందులో ఎలాంటి ప్రత్యేకత లేదంటున్నారు. ఏదిఏమైనా.. అఘోరాలు పాల్వంచలో కొన్నిగంటలు విడిది చేయడం ఆ ప్రాంతంలో హల్‌చల్ చేసింది.