ప్రమాదం జరిగిన ప్రతి సారీ రైల్వే చెప్పే మాట ఇదే!

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం రైల్వేల చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదాలలో ఒకటి అన్నది నిస్సందేహం. అయితే ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉందంటూ సాక్షాత్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. ప్రమాద కోణంపై దర్యాప్తునకు సీబీఐ విచారణకు ఆదేశించడమూ తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 రైల్వే శాఖ, కేంద్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కుట్ర కోణాన్ని తెరపైకి తీసుకు వచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగిన ప్రతి సారీ రైల్వే శాఖ  కుట్ర కోణం ఉందని చెప్పడం పరిపాటిగా మారిపోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ కుట్ర కోణానికి మతపరమైన మసాలా జోడించి దేశంలో విద్వేషాలు రగిలేలా సామాజిక మాధ్యమంలో పోస్టుల వెనుకే నిజమైన కుట్ర ఉందని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా చేసిన ప్రకటన ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

రెండు రైల్వే పోలీసు డిస్ట్రిక్ట్స్ కు ఎస్పీగా, ఒడిశా రైల్వే పోలీసు అదనపు డీజీపీగా పని చేసిన అనుభవం ఉన్న నాగేశ్వరరావు మరో ట్వీట్ లో ఎప్పుడు రైలు ప్రమాదం జరిగినా.. ఆ ప్రమాదం వెనుక ఉన్నరైల్వే వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరలచ్చడానికి, తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి రైల్వే అధికారులు వ్యూహాత్మకంగా ‘కుట్ర’ జరిగిందంటూ ప్రకటనలు గుప్పించడం పరిపాటేనని పేర్కొన్నారు.  తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇంత కాలంగా విజయవంతంగా రైల్వే శాఖ ఉన్నతాధికారులు అనుసరిస్తున్న ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు.  ప్రస్తతం కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై సామాజిక మాధ్యమంలో  విద్వేషం పెచ్చరిల్లేలా వస్తున్న వార్తల నేపథ్యంలో సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  

ఆయన వ్యాఖ్యలు రైల్వే శాఖనే కాకుండా నేరుగా  కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నట్లుగా ఉండటంతో ఇప్పుడు కేంద్రం ఎలా స్పందిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తును తప్పుపడుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ప్రమాదానికి కారకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, అంతే కానీ దర్యాప్తుల పేరుతో కాలయాపన జరపడం తగదని ఖర్గే ఆ లేఖలో పేర్కొన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం వెనుక కుట్ర కోణాన్ని దర్యాప్తు చేయాలంటూ సీబీఐకి కేసును అప్పగించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది. అలాగే మల్లికార్జున్ ఖర్గు ప్రధానికి రాసిన బహిరంగ లేఖలో భద్రతా ప్రమాణాలను గాలికొదిలేసి.. దర్యాప్తునకు ఆదేశించి చేతులు దులుపుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. సిబ్బంది కొరత, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వైఫల్యం వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు.