ఈడీ విచారణకు నటుడు జగపతి బాబు
posted on Sep 26, 2025 7:26AM

సాహితీ ఇన్ ఫ్రా కేసులో నటుడు జగపతిబాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. గురువారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం ఈడీ అధికారులు ఆయనను నాలుగు గంటలకు పైగా విచారించారు. ఇంతకీ విషయమేంటంటే.. సాహితీ ఇన్ ఫ్రా తరపున హీరో జగపతిబాబు పలు ప్రకటనల్లో నటించారు. ఈ క్రమంలో జగపతిబాబు, సాహితీ మధ్య ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ప్రశ్నించారు.
సాహితీ ఇన్ ఫ్రాపై పలు ఆరోపణలు ఉన్నాయి. ప్రీ లాంచింగ్ పేరుతో అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణం పేరిట కొనుగోలుదారుల నుంచి భారీ మొత్తం వసూలు చేసి చేసి మోసాలకు పాల్పడిందనీ, ఆ డబ్బులను అక్రమంగా తరలించిందన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ దర్యాప్తులో సాహితీ ఇన్ ఫ్రా ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు గుర్తించింది. దీంతో పోలీసులు సీజ్ చేసిన ప్రాపర్టీస్ తో పాటు తన దర్యాప్తులో గుర్తించిన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఫ్రీలాంచ్ విల్లా, ఫ్లాట్ల పేరుతో సాహితీ ఇన్ ఫ్రా దాదాపు 700 మంది కస్టమర్ల నుంచి 800 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు సాహితీ ఇన్ ఫ్రా ఎండి లక్ష్మీ నారాయణ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడి అధికారులు ఈ కంపెనీ తరఫున పలు ప్రకటనలు ఇచ్చిన నటుడు జగపతి బాబుకు నోటీసులు ఇచ్చి గురువారం (సెప్టెంబర్ 25) విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలోనే జగపతిబాబు ఈడీ ఎదుట హాజయర్యారు. సాహితీ ఇన్ ఫ్రా ప్రకటనలలో నటించినందుకు జగపతి బాబు తీసుకున్న సోమ్ము ఎంత, ఆ సొమ్ము చెల్లింపు ఎలా జరిగింది అన్న విషయాలపై జగపతిబాబును ఈడీ విచారించినట్లు సమాచారం.