తెలంగాణ తరహాలో ఏపీలోనూ 51 కోట్ల ఈఎస్ఐ స్కామ్.. అచ్చెన్నాయుడు పాత్ర!!

ఏపీలోనూ తెలంగాణ తరహాలో భారీగా ఈఎస్ఐ స్కామ్ జరిగింది. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు జరిపిన దర్యాప్తులో మందుల కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఆరేళ్లుగా కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులను అక్రమార్కులు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ కొటేషన్లతో రేట్ కాంట్రాక్టులో లేని సంస్ధలకు సైతం ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్ గుర్తించింది. ప్రభుత్వం మందుల కొనుగోళ్ల కోసం మొత్తం 89 కోట్లు చెల్లించగా.. అందులో 38 కోట్లు నిబంధనల ప్రకారం చెల్లించినట్లు, మరో 51 కోట్లు మాత్రం అక్రమార్కులు మింగేశారు. అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్నాయుడికీ ఇందులో పాత్ర ఉన్నట్లు తేలింది.

తెలంగాణలో కొన్నినెలల క్రితం చోటుచేసుకున్న ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల స్కామ్ మరకవకముందే ఏపీలోనూ అదే తరహా అవినీతి చోటుచేసుకున్నట్లు తాజాగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈఎస్ఐలో కీలకంగా ఉన్న పలువురు అధికారులు కుమ్మక్కై దాదాపు 51 కోట్ల మేర అక్రమ కొనుగోళ్లు జరిపినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. నిబంధనల ప్రకారం రేట్ కాంట్రాక్టులో ఉన్న సంస్ధల నుంచి మాత్రమే మందులు కొనుగోలు చేయాల్సి ఉండగా.. అందులో లేని సంస్ధల నుంచి కూడా 51 కోట్ల రూపాయల మేర చెల్లింపులు చేసి మందులు తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. అదీ వాస్తవ ధర132 శాతం అధికంగా చెల్లింపులు జరిపినట్లు విజిలెన్స్ విచారణ నివేదికలో తెలిపింది. ఈ మొత్తం స్కామ్ లో కీలక పాత్ర పోషించిన సరఫరాదారులు తెలంగాణ ఈఎస్ఐ స్కామ్ లో నిందితులుగా ఉన్నవారే కావడం ఇక్కడ మరో విశేషం.

ఏపీలో చోటు చేసుకున్న ఈఎస్ఐ స్కామ్ లో అప్పట్లో డైరెక్టర్లుగా వ్యవహరించిన రవికుమార్, విజయ్ కుమార్ తో పాటు ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు, ఫార్మసిస్టులు, సీనియర్ అసిస్టెంట్ ను అధికారులు బాధ్యులుగా తేల్చారు. వీరిపై తదుపరి చర్యల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈ ముగ్గురు డైరెక్టర్లు గా వ్యవహరించిన సమయంలో 975 కోట్ల రూపాయల మందుల కొనుగోలు చేస్తే, అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులకు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. మందుల కొనుగోలుకు ప్రభుత్వం 293 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, ఈ ముగ్గురు డైరెక్టర్లు 698 కోట్ల రూపాయలకు మందులను కొనుగోలు చేశారు. అంటే ప్రభుత్వానికి 404 కోట్ల రూపాయలు నష్టం కలిగేలా వ్యవహరించారు. లెజెండ్ ఎంటర్ ప్రైజెస్, ఓమ్ని మెడీ, ఎన్వెంటర్ పర్ఫామెన్స్ సంస్థలే రెండు రాష్ట్రాల్లో భారీగా ఈఎస్ఐ స్కామ్ కు పాల్పడ్డాయి. ఈ మూడు సంస్థలకు లాబ్ కిట్ల కొనుగోలు పేరుతో 85 కోట్ల రూపాయలను అక్రమంగా చెల్లించినట్లు తేలింది. లెజెండ్ ఎంటర్ప్రైజెస్ ద్వారా ల్యాబ్ పరికరాల కోసం ఎలాంటి టెండర్లు లేకుండానే 2 కోట్లకు కొనుగోలు చేసినట్టు ఇడెంట్లు సృష్టించారని విజిలెన్స్ నివేదిక వెల్లడించింది.

2018 19 సంవత్సరానికి 18 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉం టే , అందులో కేవలం 8 కోట్లు మాత్రమే వాస్తవ ధర అయితే 10 కోట్లు అదనంగా నిధులు స్వాహా చేసినట్టు అధికారులు గుర్తించారు. మందుల కొనుగోలు, ల్యాబ్ కిట్లు, ఫర్నిచర్, ఈసీజీ సర్వీసులు బయోమెట్రిక్ యంత్రాలను కొనుగోలు లో భారీగా అక్రమాలు జరిగినట్టు కూడా విజిలెన్స్ నివేదికలో తేలింది. ఒక్కో బయోమెట్రిక్ మిషన్ వాస్తవ ధర 16,000 అయితే ఏకంగా 70 వేల చొప్పున ఇండెంట్లు సృష్టించినట్లు విజిలెన్స్ నిర్ధారించింది. జర్సన్ ఎంటర్ప్రైజెస్ అనే నకిలీ సంస్థను సృష్టించి కందుల కొనుగోలు పేరుతో నిధులు మళ్లించినట్లు తేలింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అప్పట్లో కార్మికశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు పాత్ర కూడా ఉందదని విజిలెన్స్ నివేదికలో తేల్చారు. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని, నామినేషన్ పద్ధతిలో ఆర్డర్లు కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించిట్లు నివేదిక తెలిపింది.