రాజకీయాలలో దుస్సంప్రదాయలు నెలకొల్పితే

 

తెదేపా ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్యకు మంగళవారం నాడు ఎసిబి కోర్టు బెయిలు మంజూరు చేయగానే, ఎసిబి అధికారులు మళ్ళీ మరొకరికి నోటీసులు జారీ చేయడం ఆశ్చర్యం కలిగించినా అది ఊహించిన పరిణామమేనని చెప్పవచ్చును. ఇంతకు ముందు తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్ధి వేం నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించిన ఎసిబి అధికారులు ఈసారి బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్ కి నోటీసులు జారీ చేసారు. అది కూడా 24గంటలలోగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఆయన పేరు కూడా పోన్ కాల్స్ జాబితాలో ఉంది కనుక ప్రశ్నించడానికి పిలుస్తున్నట్లు సమాచారం.

 

పైకి ఇది కేసుకి సంబంధించి జరుగుతున్న విచారణగా కనిపిస్తున్నప్పటికీ, ఇది ముమ్మాటికీ తెలంగాణా తెదేపా నేతల మనోదైర్యాన్ని దెబ్బ తీయడానికేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తికి ఎసిబి అధికారులు నోటీసులు పంపి విచారణకి పిలవడం, అది కూడా కేవలం 24గంటల వ్యవధిలో తమ ముందు హాజరు కావాలని కోరడం ద్వారా వేం నరేందర్ రెడ్డి కుటుంబంపై తీవ్ర ఒత్తిడి సృష్టించేందుకేనని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదివరకు తెదేపా ఎమ్మేల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తరువాత, ఆయన ఇంట్లో ఎసిబి అధికారులు శోదాలు చేయడం, ఆయన భార్యని కూడా ప్రశ్నించడం వంటివన్నీ అందులో భాగంగా చేస్తున్నావేనని వారు అభిప్రాయ పడుతున్నారు.

 

ఈవిధంగా కేసుకి సంబంధం ఉందనే ఏదో ఒక మిషతో తెదేపాతో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు పంపుతూ ఒత్తిడికి గురిచేయడం ద్వారా వారిని తెరాసలోకి ఆకర్షించడమే తెరాస ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే నిజమయితే ఈ నోటీసుల తంతు ఇక నిరంతర ప్రక్రియగా కొనసాగే అవకాశం ఉందని భావించవచ్చును. పాములతో ఆడుకొనేవాడు పాము కాటుకి బలయినట్లు, కత్తులు, తుపాకులు, బాంబులతో ఆడుకొనేవాడు చివరికి వాటికే బలయినట్లుగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇటువంటి దుస్సంప్రదాయాలకు శ్రీకారం చుడితే మళ్ళీ ఏదో ఒకనాడు వారు కూడా వాటికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తమిళనాడులో రాజకీయాలను గమనిస్తే అర్ధమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu