కేసీఆర్ బాటలో జగన్.. 'ఏబీఎన్' ఛానల్ పై నిషేధం!!

 

గతంలో సీఎం కేసీఆర్ తెలంగాణలో కొన్ని న్యూస్ ఛానల్స్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే బాటలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన సమయంలోనే.. ఏ ఛానెల్ కానీ, ఏ పత్రిక కానీ.. తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు ప్రచురించిందని తెలిస్తే కఠిన చర్యలు తప్పవని గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీనితో మీడియాపై జగన్ ఉక్కుపాదం తప్పదని అనుకున్నారంతా. అయితే ఇప్పుడు అధికారికంగా నిషేధం విధించకపోయినా.. ఏబీఎన్ ఛానెల్ కు జగన్ సర్కార్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ ఆదేశాలతో.. ఏబీఎన్ ఛానెల్ ప్రసారాలను నిలిపివేయాలని మంత్రులు ఆపరేటర్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట. దీంతో పలు జిల్లాల్లో ఏబీఎన్ ఛానెల్ ప్రసారాలు నిలిచిపోయాయట. ముఖ్యంగా కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ విషయం ఆంధ్రజ్యోతి తన పత్రికలో రాసుకొచ్చింది. 

కాగా ఈ విషయంపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. శుక్రవారం నాడు టీడీపీ సీనియర్‌ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ క్రమంలో కొన్ని వార్తా ఛానెళ్ల ప్రసారాల నిలిపివేత ప్రస్తావన రావడంతో.. ప్రభుత్వ వైఖరిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూస్‌ ఛానెళ్ల ప్రసారాలను నిలిపేయాలని మంత్రులే బెదిరించడమేంటని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేయాలని చూశారు.. ఇప్పుడు న్యూస్‌ చానెళ్ల గొంతు నొక్కేస్తున్నారు. అయినా ఛానళ్ల ఎంపిక వినియోగదారుల అభీష్టం. తమకు ఏ ఛానళ్ళు కావాలో వినియోగదారులే ఎంచుకుంటారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.