సీఎం జగన్‌కు బ్రాహ్మణ సమాఖ్య ప్రధాన కార్యదర్శి లేఖ.. దర్శనాలు నిలిపివేయండి

ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ఆలయ అర్చకులు సైతం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కి బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రేయ బాబు లేఖ రాశారు. కరోనా రోజురోజుకీ ఉదృతమవుతోందని.. ఈ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించడం వల్ల అర్చకులు, వేదపండితులు కరోనా బారిన పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. 

కరోనాతో తిరుమలలో అర్చకుడు మృతి చెందడం అమంగళకరమని, మునుపెన్నడూ లేని రీతిలో తిరుమల అప్రతిష్ట పాలుకావడం శోచనీయం అన్నారు. తక్షణం రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఆలయాల్లో దర్శనాలు నిలిపివేయాలని కోరారు. ఆర్థిక భారం పేరుతో భక్తులను దర్శనానికి అనుమతించడం సమంజసం కాదని హితవు పలికారు. కరోనాతో మృతి చెందిన అర్చకుడికి వెంటనే 10లక్షలు నష్ట పరిహారం చెల్లించాలి డిమాండ్ చేశారు. అర్చకుడి కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. దేవాదాయ అడిషనల్ కమిషనర్ పర్యవేక్షణలో కరోనా బారిన పడిన అర్చకులకు మెరుగైన వైద్యం అందించాలి అని ఆత్రేయ బాబు డిమాండ్ చేశారు.