ఏపీలో శానిటైజర్ మరణాల తీగ లాగితే తెలంగాణలో తేలింది..

కొద్ది రోజుల క్రితం ఏపీలోని ప్రకాశం జిల్లా కురిచేడు, పామూరులో శానిటైజర్ తాగి 16 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటన పై విచారణ జరిపేందుకు ఏర్పాటైన సిట్ దర్యాప్తులో కొన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. అసలు చనిపోయిన వారు తాగిన శానిటైజర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే అంశంపై అధికారులు ఆరాతీయగా తెలంగాణాలో పెద్ద డొంక కదిలింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో ఉన్న ఒక కంపెనీలో ఈ శానిటైజర్లు తయారు చేసినట్టు తెలిసింది. ఐతే ఆ శానిటైజర్లు తయారు చేసిన కంపెనీకి ఎటువంటి లైసెన్స్ లేదు సరి కదా కనీసం జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా లేదు.

 

అంతే కాకుండా అసలు శానిటైజర్ తయారీలో కూడా గోల్ మాల్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇథనాల్ కానీ లేదా ఇథైల్ ఆల్కహాల్ కానీ కలిపి తయారు చేయాల్సిన శానిటైజర్ లో మిథైల్ ఆల్కహాల్ కలిపి చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఇక్కడ తయారైన శానిటైజర్లను ఏపీలోని ఒక డిస్ట్రిబ్యూటర్‌కు పంపగా అవి కురిచేడుకు చేరి 16 మంది ప్రాణాలు హరించాయి. ప్రస్తుతం ఈ కేసు ను ఐదు బృందాలు విచారణ జరుపుతున్నాయి. కురిచేడులో శానిటైజర్ తాగిన వారిలో 46 మంది ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.