80 శాతం మంది కరోనా బాధితులకు ఆ లోపం వల్ల ముప్పు ఎక్కువ.. తాజా పరిశోధనలో వెల్లడి 

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. దాడి చేస్తూనే ఉంది. దీని తాకిడికి ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారికి కరోనా సోకినా పెద్ద సమస్య లేకపోవచ్చు కానీ.. ఇప్పటికే పలు అనారోగ్యాలతో బాధ పడుతున్న వారు దీనికి బలైపోతున్నారు. దీంతో డాక్టర్లు మంచి ఆహారం తీసుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచిస్తున్నారు.

 

అయితే తాజాగా జరిగిన ఒక పరిశోధనలో కరోనా బారిన పడుతున్న వారిలో 80 శాతం మందికి "డి విటమిన్" లోపం ఉందని స్పెయిన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అధ్యయనంలో భాగంగా 216 మందిని పరిశీలించగా వారిలో 80 శాతం మంది రక్తంలో డి విటమిన్ తగినంత స్థాయిలో లేదని తేలిందని ఆ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరీ ముఖ్యంగా మహిళలతో పోలిస్తే పురుషులలోనే డి విటమిన్ తక్కువగా ఉన్నట్లు కూడా వారు నిర్ధారించారు. ఈ అధ్యయనం ప్రకారం తగినంత డి విటమిన్ లేకపోవడం వల్ల కరోనా రోగుల పరిస్థితి విషమించి చనిపోయే ప్రమాదం 51.5 శాతం ఉందని శాస్త్రవేత్తలు తేల్చి చెపుతున్నారు. అంతేకాకుండా "డి విటమిన్" లోపం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డి విటమిన్ తక్కువగా ఉన్నవారిలో డయాబెటీస్, రక్తపోటు, ఒబేసిటీ వంటి వ్యాధులు వస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.