బ్యాంకులు బంద్.. పది రోజులు ఫసక్..
posted on Mar 24, 2021 3:33PM
వరుస పండగలు. వరుస సెలవులు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 5వ తేదీ మధ్య.. ఈ పది రోజుల్లో కేవలం 4 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. మిగతా ఆరు రోజులు బ్యాంకులకు సెలవు. నాలుగో శనివారం, రెండు ఆదివారాలు, హోలీ, గుడ్‌ఫ్రైడే, బాబూ జగ్జీవన్‌రాం జయంతి ఉండటంతో ఆరురోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వరుస సెలవులతో బ్యాంకు శాఖలతో నేరుగా పని ఉండే ఖాతాదారులకు ఇబ్బంది తప్పకపోవచ్చు. ఖాతాదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు. నెలాఖరు కావడంతో ఉద్యోగుల వేతనాలు, చెక్‌లు ఇతర చెల్లింపులు వంటి వాటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు.
పది రోజుల్లో.. మార్చి 30, 31, ఏప్రిల్ 3.. ఈ మూడు రోజులు మాత్రమే బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఏప్రిల్ 1న బ్యాంకులకు వర్కింగ్ డే అయినా కూడా ఆ రోజు కొత్త ఆర్థిక సంవత్సరం (అకౌంటింగ్ ఇయర్) ప్రారంభం కానుండటంతో బ్యాంక్ ట్రాన్జాక్షన్స్ జరగవు. ఆన్‌లైన్ సేవలు, ఏటీఎంలలో నగదు లావాదేవీలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు.