రంగేసి..వయసు దాచి..అయ్యప్ప దర్శనం

 

కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలోకి మహిళలందరికీ ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పటికీ కొన్ని హిందూ ధార్మిక సంస్థలు ఆ తీర్పును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. గత వారం బిందు, కనక దుర్గ అనే ఇద్దరు మహిళలు స్వామి వారి దర్శనం చేసుకొని రావడం తీవ్ర దుమారానికి దారి తీసింది. రాష్ట్రంలో తీవ్ర నిరసనలకు, ఆందోళనలకు కారణమైంది. తాజాగా ఇప్పుడు 36 ఏళ్ల మంజు అనే ఓ దళిత మహిళ తాను వృద్ధ మహిళగా కన్పించేందుకు తలకు రంగేసుకొని ఆలయంలోకి ప్రవేశించినట్లు పేర్కొంది. మహిళ ఫెడరేషన్‌ కార్యకర్త అయిన ఆమె ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొంది. జుట్టుకు రంగేసుకొని ఆలయంలోకి 18 మెట్ల ద్వారా దర్శనానికి వెళ్లానని, ఇక మీదటా ఆలయంలోకి వెళ్తానని తెలిపింది. దీంతో ఆందోళనకారులు ఈమె ఇంటిపై దాడి చేశారు. గత అక్టోబర్‌లో ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 20 మంది మహిళల్లో ఈమె ఒకరు. అయితే, మంజు తనకు తానుగా ఆలయంలోకి ప్రవేశించానని చెప్పడంతో ఆలయాధికారులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆమె ప్రవేశించింది అని చెప్పడానికి ఎటువంటి సరైన ఆధారాలూ లేవని పేర్కొన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఆలయంలోకి 10 మంది మహిళలు ప్రవేశించారనే దాంట్లో వాస్తవం లేదని వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu